సినిమాలు అడ్డుకుంటే తెలంగాణా వస్తుందా?

సమైక్యవాదుల సినిమాలను అడ్డుకుంటామని కెసిఆర్‌ కూతురు కవిత ప్రకటించడంపై టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు అడ్డుకుంటే తెలంగాణా వస్తుందా అని టిడిపి నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. టిడిపి గ్రేటర్‌ నాయకులు తీగల కృష్ణారెడ్డి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, సాయన్న, సలీం, కెఎస్‌ రత్నం, బుగ్గారావుతో కలిసి తలసాని ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా
కెసిఆర్‌ భావిస్తున్నారని కెసిఆర్‌, అయన కుటుంబం నుంచే సమస్యలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణా విషయంలో టిడిపి అన్ని విధాలా సహకారం అందిస్తోందని, తెలంగాణా కెసిఆర్‌ కుంటుంబానిది కాదని, అందరిదని అన్నారు. అదుర్స్‌ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడం తగదని, ఇది తెలంగాణా సంస్కృతి కాదని హితవు పలికారు. విధ్వంసాలు సృష్టిస్తూ ఇతరులను ఇబ్బంది పెడ్తూ తెలంగాణాను సాధించలేరని అన్నారు. టిఆర్‌ఎస్‌ విధానాలపై కెయు, ఓయు, రాజకీయ జెఎసిలు స్పందించాలని ఆయన కోరారు. తమ సహకారం అవసరమా లేదా జెఎసి నేతలు ఆలోచించాలని తలసాని అన్నారు. నగరంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలతో ఒక కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ప్రజల ఆస్తులను విధ్వంసం చేయరాదని అన్నారు. నగరంలో శాంతిర్యాలీ విషయమై గతంలోనే తాము యోచించామని, అయితే తెలంగాణా ఉద్యమానికి ఆటంకం ఉండరాదని విరమించుకున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయాలకతీతంగా నగరంలో శాంతిర్యాలీ నిర్వహించడానికి సహకరిస్తామని తలసాని చెప్పారు. టిఆర్‌ఎస్‌ విధానాలతో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని టిడిపి నగర అధ్యక్షులు తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణా పేరుతో కెసిఆర్‌ ఆస్తులను సంపాదిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో నివసించే అన్ని ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్టీఆర్‌ మనువడని, ఎన్నికల్లో టిడిపికి ప్రచారం చేశారనే జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్‌ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. 2009 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకొని ఎంపి, ఎమ్మెల్యే అభ్యుర్థుల నుండి డబ్బు వసూలు చేసిన కవితకు మాట్లాడే అర్హత లేదని అన్నారు.
టిడిపి రంగారెడ్డి జిల్లా అద్యక్షులు మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా అంటే కెసిఆర్‌ ఆయన కుటుంబ సభ్యులు నల్గురు మాత్రమే కాదని అన్నారు. జెఎసి తీర్మానం చేసిన తర్వాత కూడా టిఆర్‌ఎస్‌ నాయకులు సినిమాలపై దాడులు చేయడం తగదన్నారు. సినిమాలు అడ్డుకోవడం ఆర్థిక నేరం కిందికి వస్తుందని హెచ్చరించారు. కెసిఆర్‌ కుటుంబాన్ని అదుపు చేయాలని ఆయన జెఎసి నేతలకు, ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ అదుర్స్‌ సినిమాను అపమంటే ఏమిటి? ఉద్యమం నడుపాలని ఉందా, దోచుకోవాలని ఉందా అని నిలదీశారు. టిడిపి నగర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రజల హక్కులను ఎవరు హరించినా చట్టపర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా నగరంలో శాంతిర్యాలిని నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం కాంగ్రెస్‌, బిజెపి, ఎంఐఎం నేతలతో మాట్లాడుతామని, మనసు మార్చుకొని టిఆర్‌ఎస్‌ పాల్గొంటే మంచిదని అన్నారు.
సినిమాలు అడ్డుకుంటే తెలంగాణా వస్తుందా? సినిమాలు అడ్డుకుంటే తెలంగాణా వస్తుందా? Reviewed by AndhraDarshini on 00:45 Rating: 5

No comments:

Facebook