కాంతిలేని సంక్రాంతి

తెలుగు నాట అత్యంత ప్రాధాన్యత పొందిన పండుగ సంక్రాంతి. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు వచ్చే పండుగ కాబట్టి మకర సంక్రాంతిగా పేర్కొంటారు. అందరికి ఇష్టమైన ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు బోగి పండుగ. తెల్లవారుజామునే లేచి ఇళ్లవాకిళ్ల ముందు కలాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో గొబ్బిళ్లు తయారు చేసి వాటికి పసుపు, కుంకుమ, గరక, పూలతో అలంకరిస్తారు.
బోగి మంటలు వేసుకుని కాపుకుంటారు. తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేకంగా రాగులు, సజ్జల రొట్టెలు, గుమ్మడికాయ కూరలాంటి వంటకాలు చేస్తారు. రెండో రోజు మకర సంక్రమణ సందర్భరంగా రంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్లు పెట్టి పూజిస్తారు. ప్రత్యేకంగా పొంగలి అని పులగం పరమాన్నంలో నువ్వులు, బెల్లంతో కలిపి వంట చేస్తారు. మూడో రోజు కనుమ ముఖ్యంగా మాంసాహారం, పొలావు వండుకుని తింటారు. ఇలా పేద, ధనిక అనే తేడా లేకుండా మూడు రోజుల పండుగ చేసుకుంటారు. ప్రస్తుతం చలికాలం కాబట్టి నువ్వుల రొట్టెలు, నువ్వుల గరిసెలు, కోడి మాంసం, గుమ్మడికాయ కూరలు శరీరంలోకి వేడి కలిగించే పదార్థాలు. అందుకే వీటికి ప్రాధాన్యత ఇస్తారని నానుడి. చలికాలంలో నువ్వులు, పిండి, నూనెతో స్నానం చేస్తే చర్మవ్యాధులు దూరమవుతాయని విజ్ఞానశాస్త్రంలో పేర్కొన్నారు. కొందరు సంక్రాంతి పండుగకు లేదనకుండా దానం చేస్తారు. అందుకే ఈ కాలాన్ని దేవదానకాలంగా పిలుస్తుంటారు. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ వృత్తికళాకారులు బిక్షాటన చేస్తూ ధాన్యాన్ని స్వీకరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వారు బాల సంతపు వాళ్లు, కొందరు వృత్తికళాకారుల తమ కళలను ప్రదర్శిస్తూ భిక్షాటన చేస్తుంటారు. డూడూ బసవన్నలు..దొడ్డవారంటే బసవన్న..అంటూ గంగిరెద్దుల ఆటలు, పిల్లలు, పెద్దలకు అనందాన్ని కలిగిస్తాయి. రాను రాను కొన్ని కళలు కనుమరుగవుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దుల ఆటలు కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. ఇదంతా పండుగ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. అయితే వాస్తవ పరిస్థితులు ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఆ సందడేది?
నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లో సందడి..సందడిగా ఉండాలి. పండుగకు కొత్త బట్టలు కొనడానికి కొందరు ఇష్టపడరు. కానీ కొన్ని వ్యాపార సంస్థలు ఆఫర్లతో కొనుగోళ్లకు వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్ని ఆఫర్లు వచ్చినా బట్టలు కొనే పరిస్థితిలో వినియోగదారులు లేరు. దీనికి కారణం ఆర్థికమాంద్యంతోపాటు తాజా పరిస్థితులు కారణమవుతున్నాయి. ధరల పెరుగుదల నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇళ్ల ముంగిట్లో పెద్ద పెద్ద ముగ్గులు, వివిధ డిజైన్లతో అలంకరిస్తున్నా, జనం ముఖాల్లో కళ తప్పింది. ఒక వైపు నిత్యావసరాల ధరల పెరుగుదల, మరోవైపు ఆర్టీసీ ఛార్జీల పెంపు పండుగను నిరుగార్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి కాంతి కనిపించడం లేదు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో నివసించే జనం సాధారణంగా పండుగ పూట గ్రామాలకు వెళతారు. అందరికి కలుసుకుని పండుగ చేసుకుంటారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు ఆ ఉత్సాహాంపై నీళ్లు చల్లింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ వేసిన ప్రత్యేక బస్సులు ప్రయాణీకులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో గ్రామాల్లో సంక్రాంతి సందడి కరువైంది.
కాంతిలేని సంక్రాంతి కాంతిలేని సంక్రాంతి Reviewed by AndhraDarshini on 00:47 Rating: 5

No comments:

Facebook