24వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ పుస్తక లోకంలో సాహితీ సౌరభం

పుస్తకాలు... ఎక్కడ చూసినా పుస్తకాలు. ఒకేచోట లక్షల పుస్తకాలు. సుమారు 200 పుస్తకాల షాపులు అక్కడ కొలువుదీరాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థల నుండి స్థానికంగా మన రాష్ట్రానికి చెందిన ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో వంటి వాటి వరకూ ఇక్కడ తమ పుస్తకాలను ప్రదర్శనలో ఉంచాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య ఈ నెల 17 న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ వద్దగల పీపుల్స్‌ ఫ్లాజా ప్రాంగణంలో ప్రారంభమైన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఈ రోజు రాత్రి 9 గంటలకు ముగుస్తుంది.
    బంద్‌లు, ధర్నాలు వంటి ప్రతికూల వాతావరణ ప్రభావం పుస్తక ప్రదర్శనపై కూడా పడింది. అయినప్పటికీ చెప్పుకోతగ్గ రీతిలో పుస్తక అభిమానులు పుస్తక మేళాను సందర్శిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యకూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు, రచయితలు, ఉద్యోగులు తమ కుటుంబాలతో ఈ ప్రదర్శనకు తరలిరావడం నిర్వాహకులకు ఒకింత సంతోషాన్ని కలిగిస్తున్నది. పుస్తకాల ప్రదర్శనను కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే చూడలేం. పుస్తకాన్ని కొంటున్నారంటే జ్ఞానాన్ని అందుకుంటున్నారన్నమాట. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు 'ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక' అని అన్నారంటే పుస్తకంలో ఉండే అక్షరాల ప్రభావం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకే ప్రదేశంలో అనేక పుస్తకాల షాపులు ఏర్పాటు ఒక జ్ఞాన సముదాయంలాగా భావించవచ్చు. ఆ జ్ఞానసముదాయంలో ఎవరికి అవసరమైన పుస్తకం వారికి దొరికే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులు కంటినిండుగా కనపడే పుస్తకాలలో తమకు అవసరమైన వాటిని సంతోషంగా కొనుక్కుంటున్నారు. బాలలకు ఉపయోగపడే పుస్తకాల నుండి తత్త్వశాస్త్ర పుస్తకాల వరకూ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండటంతో అన్ని రంగాలకు చెందిన సందర్శకులకు తమ అవసరాలకు తగిన పుస్తకాలను పొందే అవకాశం కలిగింది.
సాహిత్య కార్యక్రమాలు
    పుస్తకాలకు సాహిత్యానికి అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. ప్రజలకు చైతన్యాన్ని అందించే సాహిత్యాన్ని సృష్టించిన ప్రముఖ రచయితలను బుక్‌ఫెయిర్‌ స్మరించుకుంది. సాహితీస్రవంతి, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ సంయుక్తంగా ప్రముఖ రచయితల ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్లాసిక్స్‌ అనేటువంటి పుస్తకాలను రచించిన టాల్‌స్టారు, గోర్కీ, బెట్రెండ్‌ రస్సెల్‌, జాక్‌ లండన్‌ తదితర పలు దేశాల రచయితలు, దేశీయంగా ప్రేమ్‌చంద్‌, రవీంద్రనాథ్‌ టాగూర్‌, శరత్‌ చంద్ర, తెలుగు సాహిత్యంలోని మహా రచయితలు గురజాడ, శ్రీశ్రీ, విశ్వనాథ, గోపీచంద్‌ వంటి వారు సుమారు 300లకు పైగా ఫొటోలు ఈ ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. అంతేగాక తెలుగుభాష ప్రాచీనతను తెలియజేసే పటాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచయితలు శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, సుద్దాల హనుమంతు, త్రిపురనేని గోపీచంద్‌ల గురించి ప్రత్యేకరీతిలో ఏర్పాటుచేసిన ఫ్ల్లెక్సీ బోర్డులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ స్టాల్‌ను సందర్శిస్తున్న వీక్షకులు తమ అభిమాన రచయితల ఫొటోలను చూసి ఆనందంతో స్టాల్‌ నిర్వాహకులను అభినందిస్తున్నారు.
24వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ పుస్తక లోకంలో సాహితీ సౌరభం 24వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ పుస్తక లోకంలో సాహితీ సౌరభం Reviewed by AndhraDarshini on 04:54 Rating: 5

No comments:

Facebook