పర్యావరణ సంక్షోభం సామ్రాజ్యవాదుల పాపం, వర్థమాన దేశాలకు శాపం

భూగోళానికి పెద్ద ప్రమాదం పొంచిఉన్నా, అంతర్జాతీయ సదస్సుల్లో నిర్ణయాలు జరుగుతున్నా, దేశదేశాల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నా పారిశ్రామిక దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించకపోవడానికి కారణం ప్రకృతివనరులపై ప్రయివేటు ఆధిపత్యం, బహుళజాతి దోపిడీయే. ఈ దోపిడీ వ్యవస్థ మార్కెట్ల నిరంతర విస్తరణ మీద, మరింత ఎక్కువ వినియోగం మీద, మరింత త్వరిత ఉత్పత్తి మీదా ఆధారపడి నడుస్తోంది. కానీ ప్రకృతి వనరులు పరిమతమైనవి. పరిమిత ప్రకృతి వనరులకూ, నిరంతర విస్తరణ కోరుతున్న పెట్టుబడిదారీ అభివృద్ధికీ మధ్య వైరుధ్యమే నేడు పర్యావరణ సంక్షోభం రూపంలో ముందుకు వచ్చింది

1995లో 'వాటర్‌ వరల్డ్‌' (జల ప్రపంచం) అనే హాలీవుడ్‌ సినిమా వచ్చింది. కెవిన్‌ కాస్ట్‌నర్‌ నిర్మించి, నటించిన ఈ సినిమాలో భూగోళం వేడెక్కడం వల్ల వచ్చే జలప్రళయం తరువాత ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపించారు. వాతావరణ కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కి ధృవాల్లోని మంచు పూర్తిగా కరిగిపోతుంది. దాంతో సముద్ర మట్టం పెరిగి భూతలమంతా నీటితో నిండిపోతుంది. మానవ నాగరికతలు నాశనమవుతాయి. అక్కడక్కడా మహాపర్వత శిఖరాలు మాత్రం కొద్దిమంది ప్రజలకు ఆశ్రయమిస్తుంటాయి. అవి కూడా నీటిలోనే ఉంటాయి. ఆహారం పండించుకోడానికి నేల ఉండదు కనుక ఉన్న కొద్దిమంది ప్రజలు అనాగరిక పద్ధతుల్లో జీవిస్తుంటారు. కొంతమంది పాతబడిన నౌకలు, తెప్పల్లో తేలియాడుతూ అనంతమైన జలరాసిలో ఎక్కడినుండి ఎక్కడికో కొట్టుకు పోతూ ఉంటారు. ఎక్కడో ఒకచోట పొడి నేల ఉందన్న సమాచారంతో దాన్ని కనుగొనడానికి పడే తాపత్రయం, దానికోసం పోట్లాటలతో సినిమా ఆసక్తిగా సాగుతుంది.

చివరికి హీరోగారు పొడినేల కనుగొంటారు. హిమాలయ పర్వత శిఖరమే ఆ పొడినేల. అక్కడ చేరిన కొద్దిమంది మళ్లీ జీవన ప్రస్థానాన్ని సాగిస్తారు...ఇదీ సినిమా. ఇటీవల విడుదలైన '2012-యుగాంతం' సినిమాలోలాగా 'వాటర్‌ వరల్డ్‌'లో భూగోళ వినాశనాన్ని చూపించలేదు. జల ప్రళయం వల్ల కొన్ని శతాబ్దాల తరువాత భూమి ఎలా ఉండబోతుందో చూపించారు.
ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న పర్యా వరణ సంక్షోభాన్ని గనుక పరిష్కరించకపోతే మన తరంలోని ప్రజలే 'వాటర్‌ వరల్డ్‌' దృశ్యాలనూ, '2012' సినిమా దృశ్యాలనూ ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. ఇది సినిమా కథ కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రపంచం గుర్తించింది గనుకనే నేడు అంతర్జాతీయ వేదికల మీద ఇది ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ నెలలో కోపెన్‌హాగన్‌ లో వాతావరణ మార్పులపై జరుగుతున్న అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం కూడా ఇందులో భాగమే. ఈ సమావేశం గురించీ, దానిలోని చర్చల తీరును గురించీ పరిశీలించే ముందు అసలు వాతావరణ మార్పుల వల్ల నష్టాలేమిటో తెలుసుకోవాలి.

పర్యావరణ సంక్షోభం
సామ్రాజ్యవాద దోపిడీ, బహుళజాతి సంస్థల లాభాపేక్ష నేడు ఆర్థికవ్యవస్థలను మాంద్యంలోకీ, ప్రజలను ఆకలిలోకీ, ప్రపంచ దేశాలను యుద్ధాల్లోకీ నడపడమే కాదు మొత్తం భూగోళాన్ని తీవ్రమైన పర్యావరణ సంక్షోభంలోకి నెడుతున్నాయి. విచక్షణారహితమైన వినియోగం, ప్రకృతివనరులపై ప్రయివేటు అదుపు మీద ఆధారపడి సాగుతున్న నయా-ఉదారవాద అభివృద్ధి పంథా భూమిమీద సహజవనరులను సర్వనాశనం చేసింది. ఇంకా ఇంకా చేస్తూనే ఉంది. బహుళజాతి సంస్థలు భూమి పొరల్లోని శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను రానురాను మరింత సామర్ధ్యంతో, మరింత వేగంగా తోడేసి ఫ్యాక్టరీల్లోనూ, వాహనా ల్లోనూ మండించేస్తున్నాయి. అడవులను నరికేస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయి.

నేలను తల్లకిందులు చేసి ఖనిజాలను విచక్షణా రహితంగా తోడేస్తున్నాయి. పారిశ్రామిక అవసరాలు, రవాణా కోసం శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడం వల్ల వాతావరణం లో కార్బన్‌-డైఆక్స్త్‌డ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సయిడ్‌ వంటి వాయువుల సాంద్రత పెరిగిపోతోంది. ఈ వాయువులు భూమి పైన ఒక పొరలాగా ఏర్పడి సూర్యుని నుండి వచ్చే వేడిమిని నిలిపి ఉంచి భూగోళాన్ని క్రమంగా వేడెక్కిస్తున్నాయి. దీన్నే 'గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌' అంటున్నారు. వాతా వరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల సాంద్రత పెరిగే కొద్దీ సూర్యుని వేడిని అవి మరింతగా పట్టి ఉంచుతాయి. దానివల్ల భూగోళం మరింత వేడెక్కుతుంది.

గ్రీన్‌హస్‌ ఎఫెక్ట్‌ వల్ల గత 100 సంవత్స రాల కాలంలో భూమి మీద సగటు ఉష్ణోగ్రత అర డిగ్రీ నుండి ఒక డిగ్రీ సెలిసియస్‌ మధ్య పెరిగిందని శాస్త్రవేత్తలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు. సగటు ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగితే ఏమవుద్ది అనుకోకండి. దీనివల్ల చాలా సున్నితమైన భూ వాతావరణంలో పెద్ద మార్పు లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారిం చారు. దీనివల్ల భూగోళం ధృవాల వద్ద, ఐస్‌లాండ్‌ వంటి ప్రాంతాల్లో మంచు కరిగి పోయి జలరాసిగా మారిపోతుంది. దాంతో సముద్రాల నీటిమట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం ఒకటి రెండు మీటర్లు పెరిగితే చాలా తీర ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. మానవావాసాలుగా ఉన్న అనేక దీవులు మునిగిపోతాయి. కొన్ని జలమయమవుతాయి. తీరప్రాంతాల్లోని పల్లెలు, పట్టణాలు, నగరాలు దెబ్బతింటాయి.

ఇదే కాకుండా రుతుపవనాల్లో తేడాలు వస్తాయి. ఒక ప్రాంతంలో అధిక వర్షాలు కురిసి ఉధృతమైన వరదలు సంభవిస్తే మరికొన్ని ప్రాంతాలు అస్సలు వర్షాలు లేక కరువుకాటకాలతో అలమటిస్తాయి. జలవ నరులు నాశనమై మంచినీటికి కటకట ఏర్పడుతుంది. పంటల సీజనుల్లో మార్పులొ స్తాయి. భూమి వేడి పెరుగుతున్న కొద్దీ వరదలూ, తుపానులు, దుర్భిక్షాల తీవ్రతా, సంభావ్యతా బాగా పెరుగుతాయి.
వీటి పర్యవసానాలు ప్రజలమీద చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల సంభవించే ఉత్పాతాలు ఈ మార్పులకు కారణమైన సామ్రాజ్యవాద దేశాలకన్నా పేద దేశాలమీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అలాగే ఆయా దేశాల్లో ధనికు లకన్నా పేదలే ముందుగా, తీవ్రంగా నష్టపో తారు. భారత దేశానికి సంబంధించి...వర్ధమాన దేశాలకు ఎదురయ్యే సమస్యలన్నీ దానికి ఎదురవుతాయి. దానితోబాటు మన దేశానికి అదనపు సమస్యలు వచ్చిపడతాయి.

మొదటిది, మన గంగా, సింధు నదులు ప్రధానంగా హిమాలయాల్లోని హిమనదాలు (గ్లేసియర్స్‌) కరగడం వల్ల జీవనదులుగా నిత్యం ప్రవహిస్తు న్నాయి. భూ తాపం వల్ల ఈ హిమనదాలు ఎండిపోతే ఈ జీవనదుల్లో జీవం అదృశ్య మవుతుంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నదాంట్లో సందేహం లేదు. అలాగే మన దేశం మూడువైపులా సముద్రంతో పర్యవేళ్ఠితమై ఉంది. సముద్ర మట్టం పెరిగితే అనేక ప్రాంతాలు మునిగిపోయి లక్షలు, కోట్లల్లో ప్రజలు నిరాశ్రయులవుతారు.

ఇదంతా నిజమేనా లేక భయపెట్టడానికి చెబుతున్న మాటలా?
నిజానికి ప్రపంచంలోని పలు దేశాల శాస్త్రవేత్తలు చాలా కాలంగా భూతాప ప్రమాదం గురించి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ 1988లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ''వాతావరణ మార్పులపై ప్రపంచప్రభుత్వాల ప్యానల్‌ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లయిమేట్‌ చేంజ్‌-ఐపిసిసి) భూతాపం నిజమేనని తేల్చింది. ఈ సంస్థ స్వతహాగా పరిశోధన చేసేది కాదు. అన్ని దేశాల్లో ఈ అంశంపై జరుగుతున్న పరిశోధనలను క్రోడీకరించి, వాటిలోని విష యాన్ని నిగ్గుతేల్చి నివేదికలు ఇస్తుంది. 1990లో తొలి ఐపిసిసి నివేదిక వెలువడింది. గత శతాబ్ద కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0.5 సెంటీ గ్రేడ్‌ పెరిగిందని ఈ నివేదిక నిర్ధారించింది. నివేదిక అనేక ఆధారాలను పొందుపరిచింది. ఆర్కిటిక్‌ మంచు సంవత్సరానికి ఎంత మందం కరిగిపోతోందో ఆధారాలతో తెలిపింది.

అంటార్కిటికాలో వస్తున్న మార్పులను నమోదు చేసింది. ఐస్‌లాండ్‌, హిమాలయాలు వగైరా ప్రాంతాల్లో కుంచించుకు పోతున్న హిమనదాల రికార్డులు తయారుచేసింది. అలాగే ప్రపంచం లోని పలు ప్రాంతాల్లో తుపానులు, వరదలు, దుర్భిక్షాల వివరాలు విశ్లేషించి ఒక నిర్ధారణకు వచ్చింది. అదేమంటే, గత వెయ్యిసంవత్సరాల కాలంలో నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్ర తలున్న 20 సీజన్లలో 19 సీజన్లు ఈ మధ్య కాలంలోనే, అంటే 1980 తరువాతనే నమో దైనాయి. అత్యంత అధిక ఉష్ణోగ్రతలు గల మూడు సీజన్లు గత ఎనిమిదేళ్లలోనే వచ్చాయి. అమెరికాలో విలయం సృష్టించిన కత్రినా తుపానుతో సహా గత కొన్నేళ్లుగా తుపానుల తీవ్రత పెరుగుతోంది. దుర్భిక్షాలు, వరదల తీవ్రత కూడా పెరుగుతోంది. ఇవి గతంలోకన్నా తరచూ రావడం జరుగుతోంది. అర డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకే పరిస్థితి ఇలా ఉంటే ఇంక రానున్న కాలంలో మరింతగా గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణంలో చేరితే పరిస్థితి ఏమిటి?

1995, 2001, 2007లలో వెలువడిన రెండు, మూడు, నాలుగో ఐపిసిసి నివేదికలు భూ తాపానికి సంబంధించిన అనేక వివరాలు తెలిపాయి. ఒక శతాబ్ద కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెలిసియస్‌ వరకు పెరగ వచ్చుననీ, పర్యవసానంగా సముద్ర మట్టాలు కనీసం 18 సెంటీమీటర్ల నుండి 59 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చునని నివేదికలు తెలిపాయి. ఈ పరిశీలనా కాలంలోనే అంటే 1998వ సంవత్సరంలో ఈ సహస్రాబ్దికే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది. 2003లో ఐరోపా ఖండం గత 500 సంవత్సరాల్లో ఎన్నడూ ఎరుగనంతటి వేడిని చవిచూసింది. చలి ప్రదేశాలైన ఐరోపాలో ఆ ఏడాది 30,000 మంది ప్రజలు వడగాడ్పులకు మరణించారు. ప్రపంచ వ్యాపితంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులను పరిశీలించేందుకు ఈ ఏడాది జపాన్‌ ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ఆధారంగా శాస్త్రవేత్తలు తమ నిర్ధారణలు కొంత సవరించారు. 2100 నాటికి సముద్ర నీటిమట్టం ఒక మీటరు పెరుగుతుందని తాజాగా నిర్ధారణకు వచ్చారు.

అందువల్ల భూతాపం నిజం, దానివల్ల సంభవిస్తున్న విపత్తులు నిజం అని తేలింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో భూమి మీద మానవుని మనుగడకే ప్రమాదం అని తేలింది. పర్యవసానంగా ప్రపంచ దేశాలు చాలా మట్టుకు కదిలాయి. అనేక అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించాయి.

కోపెన్‌హాగన్‌ సదస్సు పూర్వరంగం
మానవజోక్యంతో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల భూతాపం క్రమంగా పెరుగుతు న్నదని 1990లో ఐపిసిసి తొలి నివేదికలో స్పష్టం చేసిన తరువాత 1992 బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో తొలిసారిగా వాతా వరణ మార్పులపై ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీన్ని ''ధరిత్రీ శిఖరాగ్ర సదస్సు'' (ఎర్త్‌ సమ్మిట్‌) అన్నారు. 154 దేశాలు హాజరైన ఈ సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు తమ గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించుకోవాలని తీర్మానించాయి. 2000వ సంవత్సరం నాటికి వాయువుల విడుదలను 1990 నాటి స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయించాయి. కానీ అది అమలు జరగలేదు. బహుళజాతి సంస్థల తరఫున అమెరికా ఈ సదస్సు జరగకుండా చేయడానికి అనేక ఆటంకాలు సృష్టించింది. అడుగడుగునా అడ్డు తగిలింది.

అయినప్పటికీ ''ధరిత్రీ సదస్సు'' ప్రపంచ వ్యాపితంగా బహుళజాతి సంస్థల కార్యకలాపాల వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పులపైకి ప్రజలదృష్టిని మళ్లించింది. తదుపరి క్యోటో ఒప్పందానికి బాటలు వేసింది.
తరువాత 1997లో జపాన్‌లోని క్యోటో నగరంలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను 2010 నాటికి 5.4 శాతం తగ్గించాలని ఒక ఒప్పందం ఇక్కడ కుదిరింది. అమెరికా ఈ ఒప్పందం మీద సంతకాలైతే చేసిందిగానీ తరువాత దాన్ని ఆమోదించకుండా తిరస్కరించింది. క్యోటో ఒప్పందం తరువాత అమెరికా వాయువుల విడుదల తగ్గకపోగా 17 శాతం పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ 5.4 శాతం తగ్గించాల్సింది పోయి విడుదలను 10 శాతం పెంచాయి. దాంతో వాతావరణ మార్పుల సమస్య, భూ తాపం సమస్య తగ్గక పోగా మరింత పెరిగింది.

ఈలోగా 2007లో విడుదలైన ఐపిసిసి నాల్గవ నివేదిక మరిన్ని ఆందోళనకరమైన విషయాలు వెల్లడించింది. గ్రీన్‌హౌస్‌ వాయు వుల విడుదలను ఇప్పటిమాదిరిగానే పెంచు కుంటూ పోతే ఈ శతాబ్దం చివరికి భూగోళం సగటు ఉష్ణోగ్రత 2 నుండి 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరగవచ్చునని నివేదిక తెలిపింది.

కోపెన్‌హాగన్‌లో ఏం జరగబోతోంది?
ఇలాంటి పరిస్థితుల్లో కోపెన్‌హాగన్‌ సదస్సుపై ప్రపంచ మంతా ఆశలు పెట్టుకోవడం సహజం. ప్రపంచం పర్యావరణ ఉపద్రవం నుండి తప్పుకోవాలంటే అభివృద్ధి చెందిన దేశాలు 2020 నాటికి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను 40 శాతానికీ, 2050 నాటికి 90 శాతానికీ తగ్గించుకోవాలని ఐపిసిసి సరికొత్త నివేదిక నిర్దేశించింది. ఇండొనేషియాలోని బాలిలో జరిగిన వాతావరణ సదస్సులో ఏఏ దేశాలు ఎంతెంత శాతం విడుదలలు తగ్గించు కోవాలో నిర్ణయించారు. 1990 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ తగ్గింపు జరగాలి. కోపెన్‌హాగన్‌ సదస్సులో ఈ మేరకు చట్టబద్దమైన కట్టుబాటు ఉండే (లీగల్లీ బౌండ్‌) ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకున్నారు. కాని ఇటువంటి ఒప్పందం చేసుకోడానికి పారిశ్రామిక దేశాలు సిద్ధంగా లేవు. తాము 20 శాతం తగ్గించు కుంటామని ఐరోపా యూనియన్‌ ప్రకటించగా, అమెరికా మరీ మొండికేసి 3 శాతం మాత్రమే తగ్గించుకుంటామని చెబుతోంది.

పైగా చట్టబద్దమైన కట్టుబాటుకు అమెరికా గాని చాలా ఐరోపా దేశాలుగాని ముందుకు రావడం లేదు. అందువల్ల కోపెన్‌హాగన్‌ సదస్సులో నేతలందరూ సమావేశమై ఉత్తిత్తి మాటలతో ఒక రాజకీయ ప్రకటన చేసి సదస్సును ముగించేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిజానికి చట్టబద్దమైన కట్టుబాటు లేకపోతే క్యోటో ఒప్పందానికి పట్టిన గతే కోపెన్‌హాగన్‌ ఒప్పందానికీ పడుతుంది.

పారిశ్రామిక దేశాల మెలిక
భారత్‌, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలకు చట్టబద్దంగా కట్టుబడేట్లు ఒప్పందం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. ముఖ్యంగా చైనా, భారత్‌లు వాయువుల విడుదలను తమతో సమానంగా తగ్గించుకోవాలనీ, లేకుంటే తాను ఒప్పందానికి రాబోనని మెలిక పెడుతోంది. కోపెస్‌హాగన్‌ ఒప్పందంగాని, అంతకు ముందు క్యోటో ఒప్పందం గాని వర్ధమాన దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను ఖచ్చితంగా, చట్టబద్దంగా తగ్గించుకోవాలని షరతులు పెట్టలేదు. ఎందుకంటే సామ్రాజ్యవాద దేశాల తో పోలిస్తే వర్ధమాన దేశాలు విడుదల చేసే కలుషిత వాయువులు తక్కువ. వాతావరణం లోకి విడుదలవుతున్న మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో ధనిక దేశాలే 80 శాతం విడుదల చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 5 శాతం ఉన్న అమెరికా ప్రపంచ ఇంధనవనరుల్లో 25 శాతం ఉపయోగించుకుంటోంది.

వాతావరణం లోకి 20 శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులను అదొక్కటే విడుదల చేస్తోంది. వీటితోపోల్చి నప్పుడు భారత్‌, చైనాతో సహా మొత్తం వర్థమాన దేశాలన్నీ విడుదల చేస్తున్న వాయువులు 20 శాతం మాత్రమే. వర్ధమాన దేశాలు ఇప్పుడున్న కనీస అభివృద్ధిని సాధించాలంటే ఆ మాత్రం ఇంధనం ఖర్చుచేయడం, ఆ మాత్రం వాయు వులు విడుదల చేయడం వాటికి అనివార్యం. అయితే శీఘ్రాభివృద్ధి సాధిస్తున్న చైనా, భారత్‌లు కూడా తమతోబాటు తప్పనిసరి కోటాలు తీసుకోవాలని, మిగిలిన వర్థమాన దేశాలు కూడా వాయువుల విడుదల తగ్గించుకోవాలని అమెరికా, ఇతర ధనిక దేశాలూ పట్టుబడు తున్నాయి.

ఇక్కడ రెండు సమస్యలున్నాయి. 1. గత 400 సంవత్సరాలుగా అంటే పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటినుండీ సామ్రాజ్యవాద దేశాలు దేశదేశాల ఇంధనాలను భారీ స్థాయిలో మండిస్తూ వాతావరణంలోకి గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదల చేస్తూ వచ్చాయి. అంటే వాతావరణంలో కార్బన్‌-డై ఆక్సైడ్‌ తదితర వాయువులు ఈ సాంద్రతలోకి వచ్చాయంటే అమెరికా ఇతర సామ్రాజ్యవాద దేశాలు ఇన్ని శతాబ్దాలుగా విడుదల చేసిన వాయువులే కారణం. కానీ వాతావరణం అందరిదీ, అన్ని దేశాలదీ. అన్ని దేశాల వాతావరణాన్ని అమె రికా, ఐరోపా వలసవాద దేశాలు చారిత్రకంగా ఆక్రమించుకున్నాయి. తీరా ఇప్పుడు ఆలస్యంగా రంగంలోకి వచ్చిన వర్ధమాన దేశాలకు చోటులేదు పొమ్మంటున్నాయి. అంటే ధనికదేశాలు తమ పారిశ్రామిక ప్రగతిని అట్టే పెట్టుకుంటాయి, కాని వర్ధమాన దేశాలు మాత్రం ముందుకు రావడానికి వీల్లేదన్నమాట. 2. వాతావరణంలోకి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించాలంటే చమురు, బొగ్గు, గ్యాస్‌ తదితర ఇంధనాలకు బదులు సౌరశక్తి, పవన శక్తి, అణు ఇంధనం వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలి.

దానికి విపరీ తమైన ఆర్థిక వనరులూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ కావాలి. ఈ రెండూ బహుళజాతి సంస్థల గుప్పెట్లో ఉన్నాయి. కాబట్టి ప్రత్యా మ్నాయ ఇంధనాలవైపు మళ్లడానికి వనరులూ, అవకాశాలూ ఎక్కువగా సామ్రాజ్యవాద దేశాలకే ఉన్నాయి. వర్ధమాన దేశాల వద్ద వనరులు లేవు. సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు. కాబట్టి అవి ప్రత్యామ్నాయ ఇంధనాలవైపు మళ్లలేవు. అందువల్ల పారిశ్రామిక ప్రగతిని తగ్గించుకోకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకోగల సామర్ధ్యం, స్థోమతా పారిశ్రామిక దేశాలకు మాత్రమే ఉంది. వర్థమాన దేశాలు కూడా ఈ పని చేయాలంటే వాటికి పారిశ్రామిక దేశాలు, అంతర్జాతీయ సంస్థలద్వారా నిధులూ, సాంకేతిక పరిజ్ఞానమూ బదిలీ చేయాలి. కాని ఒక్క పారిశ్రామిక దేశం కూడా ఈ పనిచేయడానికి ముందుకు రావడం లేదు.

ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంపై బహుళజాతి కంపెనీలు పేటెంట్లు పొంది తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. అందువల్ల వర్ధమాన దేశాలకు పారిశ్రామిక దేశాలు నిధులూ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయాలనీ, వాటి సాయంతో తాము స్వచ్ఛం దంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను ఏమేరకు తగ్గించుకోగలిగితే ఆ మేరకు తగ్గించుకోవాలనీ వర్థమాన దేశాలు న్యాయంగానే కోరుతున్నాయి. కాని అమెరికా దీన్ని వ్యతిరేకిస్తోంది. వర్ధమాన దేశాల అశక్తతను అడ్డం పెట్టుకుని తాను కూడా ఒప్పందం నుండి దూరం పోవడానికి ప్రయత్ని స్తోంది.
గ్రీన్‌హౌస్‌ వాయువులు-

ఇంధన హక్కు, సామాజిక న్యాయం
పర్యావరణ సంక్షోభం గ్రీన్‌హౌస్‌ వాయు వుల విడుదల వల్ల వస్తోంది. గ్రీన్‌హౌస్‌ వాయు వుల విడుదలకు పరిశ్రమలు, వాహనాలు తదితరాల్లో ఇంధన వినియోగం ప్రధాన కార ణం. ఈ రోజు ప్రపంచంలో దేశాల, ప్రజల అభివృద్ధిని ఇంధన వినియోగంతోనే కొలుస్తు న్నారు. ఎంత ఎక్కువ ఇంధనం వినియోగిస్తే అంత ఎక్కువ అభివృద్ధి చెందినట్లు. 2005 లెక్కల ప్రకారం అమెరికాలో ఒక్కోవ్యక్తి సగటున ఏడాదికి 7,885.9 కిలోగ్రాముల చమురు సమాన (కెజిఓఇ) ఇంధనాన్ని ఉపయోగిస్తు న్నాడు. అదే భారత దేశంలో అయితే సగటున కేవలం 491.0 కేజీలు మాత్రమే ఉపయో గిస్తున్నాడు. చైనాలో సగటు వినియోగం 1,316.0 కేజీలు. సగటు అమెరికన్‌ ఇంధన వినియోగం, సగటు భారతీయుని వినియోగంతో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, సగటు చైనీయుని వినియోగంతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ.

అందు వల్ల ఆయా దేశాలు విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల పరిమాణంలో కూడా ఈ వ్యత్యా సం కనిపిస్తుంది. ఆయా దేశాలు విడుదల చేస్తున్న మొత్తం గ్రీన్‌హౌస్‌ వాయువుల పరిమా ణం రీత్యా చూస్తే చైనా మొదటి స్థానంలోనూ, అమెరికా రెండో స్థానంలోనూ, భారత్‌ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. కానీ జనాభాలరీత్యా చూసినప్పుడు అమెరికా కన్నా భారత్‌, చైనాలు విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయుపరిమాణం చాలా తక్కువ. ఒక్కో భారతీయుడు ఏడాదికి సగటున 2 టన్నుల వాయువులు విడుదల చేస్తున్నాడు. సగటు చైనీయుడు 6 టన్నులు విడుదల చేస్తున్నాడు. సగటు అమెరికన్‌ 25 టన్నులు, సగటు బ్రిటిష్‌ పౌరుడు 11 టన్నులు విడుదల చేస్తున్నాడు. ఆ విధంగా చూసినప్పుడు పర్యావరణ కాలుష్యానికి అత్యధికంగా కారణమైన అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాలే ముందుకొచ్చి పెద్దఎత్తున గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించుకోవాలి.

తమ బహుళజాతి సంస్థలను అదుపుచేయాలి. చిత్తశుద్థి ఉంటే అవి తమ ప్రస్తుత ఇంధన వినియోగ స్థాయిని తగ్గించుకోకుండానే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించగలవు. వాటికున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యామ్నాయ ఇంధనాలైన సౌరశక్తి, అణుఇంధనం, పవన శక్తి వంటి వాటికి మళ్లగలవు. దానికి కావలసిన నిధులు కూడా వాటి వద్ద ఉన్నాయి. అలాగే వర్ధమాన దేశాలకు వనరులూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా వాటిచేత కూడా వాయువుల విడుదలను తగ్గింపజేసే అవకాశం కూడా పారిశ్రామిక దేశాలకూ, వాటి బహుళజాతి సంస్థలకూ మాత్రమే ఉంది.

అందువల్లనే ''ధరిత్రీ సదస్సు'' గానీ, క్యోటో ఒప్పందం గానీ వర్ధమాన దేశాలు తమ గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తప్పనిసరిగా తగ్గించాలన్న నిబంధన ఏదీ పెట్టలేదు. పారిశ్రా మిక దేశాలు ఖచ్చితంగా తగ్గించుకోవాలి అన్న చోటనే వర్థమాన దేశాలు తమ వీలును బట్టి తగ్గించుకోవాలి అని అన్నాయి. అవి అలా తగ్గించుకోడానికి కావలసిన నిధులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పారిశ్రామిక దేశాలు సరఫరా చేయాలని చెప్పాయి. కానీ పారిశ్రామిక దేశాలు ఈ రెంటిలో దేన్నీ చేయడం లేదు.

ఇంధన వినియోగ వ్యత్యాసాలు అనేవి పేద ధనిక దేశాలమధ్యనే కాదు, ప్రతి దేశంలోనూ ధనిక పేద ప్రజల మధ్య కూడా తీవ్రంగా ఉన్నాయి. భారత దేశంలో సగటు ఇంధన వినియోగం 491.0 కేజీలు. కాని ఈ దేశంలో పది శాతం మంది ప్రజలు సగటు అమెరికా పౌరుల స్థాయిని మించి ఇంధన వినియోగం చేస్తున్నారు. వీరంతా ధనిక వర్గం. అదేసమ యంలో ఈ దేశంలోని 80 శాతం మంది ప్రజలు రోజుకు రు. 20 రూపాయలకన్నా తక్కువ వేతనాలతో బ్రతుకులీడుస్తున్నారని అధికార లెక్కలే చెబుతున్నాయి. వీరి ఆదాయం లో అత్యధిక భాగం ఆహారం కొనుక్కోడానికే ఖర్చయిపోతుంది. వీరు వాడే వస్తు సామగ్రి చాలా తక్కువ. అందువల్ల వీరు వినియోగించే ఇంధనం చాలా చాలా తక్కువ. కనుక ఒక దేశం ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం అంటే ఏం చేయాలి? ధనికులు వాడే విలాసా లను తగ్గించే చర్యలు తీసుకోవాలి. అదేసమ యంలో పేద ప్రజల అభివృద్ధి జరిగేట్లూ చూడాలి. ధనిక దేశాల్లో అధిక శాతం ప్రజలకు వర్తించేదే, వర్థమాన దేశాల్లో ధనిక వర్గానికీ వర్తిస్తుంది.

కాబట్టి భూగోళ తాపం, ఇంధన వినియో గం, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల...వీటిపై చర్చ జరిగేటప్పుడు చారిత్రకంగా సామ్రాజ్య వాద దోపిడీ, బహుళజాతి సంస్థల లాభా పేక్షవల్ల జరుగుతున్న పర్యావరణ వినాశనం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంధన వినియోగంలో పేద ధనిక వ్యత్యా సాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయ సంస్థలుగానీ, దేశాలుగానీ తీసుకునే నిర్ణయాలు పేద దేశాల, ఆయా దేశాల్లోని పేద ప్రజల ఇంధన హక్కులు కాపాడ్డమే కాదు వాటిని మరింత మెరుగుపరిచే విధంగా ఉండాలే గాని వారినుండి హక్కులు లాక్కునే విధంగా, వారిని మరింత నిర్భాగ్యులుగా మార్చే విధంగా ఉండకూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ధనిక వర్గాల విలాసాలకు కోతపెట్టి, పేదల వినియోగం పెంచే విధంగా ఉండాలి.

బహుళజాతి దోపిడీ కారణం
భూగోళానికి ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నా, అంతర్జాతీయ సదస్సుల్లో నిర్ణయాలు జరుగుతున్నా, దేశదేశాల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నా పారిశ్రామిక దేశాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించకపోవడానికి కారణం ప్రకృతివనరులపై ప్రయివేటు ఆధిపత్యం, బహుళజాతి దోపిడీయే. ఈ దోపిడీ వ్యవస్థ మార్కెట్ల నిరంతర విస్తరణ మీద, మరింత ఎక్కువ వినియోగం మీద, మరింత త్వరిత ఉత్పత్తి మీదా ఆధారపడి నడు స్తోంది. కానీ ప్రకృతి వనరులు పరిమతమైనవి. పరిమిత ప్రకృతి వనరులకూ, నిరంతర విస్తరణ కోరుతున్న పెట్టుబడిదారీ అభివృద్ధికీ మధ్య వైరుధ్యమే నేడు పర్యావరణ సంక్షోభం రూపంలో ముందుకు వచ్చింది. సామ్రాజ్యవాద దేశాలు పర్యావరణ సంక్షోభాన్ని వర్థమాన దేశాలమీదకు నెట్టడానికి ప్రయత్నిస్తుంటే వర్థమాన దేశాలు కలిసికట్టుగా ఈ ప్రయత్నా లను ప్రతిఘటిస్తున్నాయి. గతంలో క్యోటో సదస్సు మాదిరిగానే కోపెన్‌హాగన్‌ శిఖరా గ్రసమావేశం సందర్భంగా జరుగుతున్న, దానికి ముందు జరిగిన పరిణామాలు ఈ ఘర్షణను ప్రతిఫలిస్తున్నాయి.

కోపెన్‌హాగన్‌ సదస్సు - భారత్‌ పాత్ర
కోపెన్‌హాగన్‌ సదస్సు సందర్భంగా భారత్‌ నిర్వహిస్తున్న పాత్ర ఊగిసలాట స్వభావంతో కూడి ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల విషయంలో భారత్‌, చైనా వంటి దేశాలు కూడా నిర్ణీత పరిమాణంలో, నిర్ణీతకాలంలో తగ్గిస్తా మని చట్టబద్దంగా కట్టుబడాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని మన దేశం ఇతర వర్థమాన దేశాలతో కలిసి ఒకవైపు ప్రతిఘటిస్తోంది. మరోవైపు పలు సందర్భాల్లో అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రీన్‌హౌన్‌ వాయువిడుదలను అమెరికా ఇతర దేశాలు తగ్గించాలని పట్టుబట్టకుండా అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. వాతావరణం ఏ ఒక్క దేశానికో పరిమితమై ఉండదు. అత్యధికంగా వాయువులు విడుదల చేస్తున్న దేశాలను అదుపు చేయకుండా భారత్‌ వంటి దేశాలు వాయువుల విడుదల తగ్గించినా ఫలితం ఉండదు. అలా చేస్తే మనమే పారి శ్రామిక దేశాలకు వాతావరణంలో మరి కొంత 'స్థలం' ఇచ్చిన వాళ్లమవుతాం. కేంద్ర వాతా వరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్‌ రమేష్‌ ఈ విషయంలో అమెరికాకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాకు అన్నివిధాలా లొంగుతున్న మన్మో హన్‌ సింగ్‌ ప్రభుత్వం ఈ చర్చల్లో దృఢంగా నిలబడడం అనుమానమేనని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలతో కలిసి భారత ప్రభుత్వం ధనిక దేశాలను ప్రతిఘటించే మేరకు దానికి మనం మద్దతివ్వాలి. అదే సమయంలో అమెరికా ముందు సాగిలబడే ధోరణిని ప్రతిఘటించాలి.

పరిష్కారం
పర్యావరణ సమస్య చాలా తీవ్రంగా, వేగంగా ముందుకొచ్చేస్తోంది. సరిదిద్దడానికి సమయం చాలా తక్కువగా ఉంది. సరిదిద్దక పోతే మన తరంలోనే వినాశకరమైన అనేక పరిణామాలు చూస్తాం. మన భవిష్యత్తరాలకు మనుగడే కష్టమవుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం కుదరాలి. సమస్య తలెత్తింది సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల విచ్చలవిడి దోపిడీ విధానాలవల్ల. అందువల్ల ఈ దోపిడీ విధానాలకు కళ్లెం వేయకుండా అరకొరచర్యలతో పరిష్కారం కుదరదు. అయితే సామ్రాజ్యవాద సంస్థలు దీనికి పరిష్కారం పేరుతో 'కార్బన్‌ ట్రేడింగ్‌' విధాన్ని ముందుకు తెచ్చాయి. చచ్చిన శవాలమీద కూడా వ్యాపారం చేయడానికి ప్రయత్నించే పెట్టుబడిదారీ స్వార్ధపూరిత వ్యవస్థ నిజస్వరూపాన్ని ఈ 'కార్బన్‌ ట్రేడింగ్‌' ప్రతిఫలిస్తుంది. వర్ధమాన దేశాల్లోని పరిశ్రమలు గ్రీన్‌హౌస్‌వాయువుల విడుదలను తగ్గించుకుంటే వాటికి కొన్ని 'క్రెడిట్‌'లు వస్తాయి. ఒక టన్ను వాయువుల విడుదల తగ్గించుకుంటే ఒక క్రెడిట్‌ కింద లెక్క. ఈ క్రెడిట్‌లను పారిశ్రామిక దేశాలు, దాని బహుళజాతి సంస్థలు కొనుక్కుంటాయి. ఒక పరిశ్రమ ఎన్ని క్రెడిట్‌లు కొనుక్కుంటే అన్ని టన్నుల వాయువులు విడుదల చేసే అధికారం దానికి వస్తుంది. అంటే వర్ధమాన దేశాలు కడుపుకట్టుకుని క్రెడిట్‌లు సంపాదిస్తే బహుళజాతి సంస్థలు ఆ క్రెడిట్‌లు కొనుక్కుని వాతావరణంలోకి వాయువులు విడుదల చేస్తాయన్న మాట. కార్బన్‌ ట్రేడింగ్‌ పేరుతో ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా పెద్ద వ్యాపారం నడుస్తోంది. ఈ వ్యాపారంలో అంతిమంగా నష్టపోవడం వర్ధమాన దేశాల ప్రజలదీ, లాభపడడం బహుళజాతి సంస్థలదీ అవుతుంది. ఆవిధంగా భూగోళానికి ఎదురవుతున్న పెను విపత్తును కూడా వ్యాపారంగా మార్చే ధోరణి నేడు రాజ్యమేలుతోంది.

ప్రపంచ వనరులపై బహుళజాతి సంస్థల అదుపు కొనసాగినంతకాలం, మానవ అవస రాలకోసం కాకుండా వ్యాపారం కోసం వనరుల విచ్చలవిడి వినియోగం జరిగినంతకాలం భూగోళానికి గ్రీన్‌హౌస్‌ వాయువుల ముప్పు తప్పదు. అందువల్ల పర్యావరణ వాదులూ, భూగోళం క్షేమం కోరుకునేవారూ తమ పోరా టాన్ని సామ్రజ్యవాద బహుళజాతి సంస్థల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టాలి. ప్రకృతివనరులపై సామాజిక అదుపు, ప్రణాళికా బద్దమైన ఆర్థికాభివృద్ధి గల సామాజిక వ్యవస్థ లో మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
పర్యావరణ సంక్షోభం సామ్రాజ్యవాదుల పాపం, వర్థమాన దేశాలకు శాపం పర్యావరణ సంక్షోభం సామ్రాజ్యవాదుల పాపం, వర్థమాన దేశాలకు శాపం Reviewed by AndhraDarshini on 02:03 Rating: 5

No comments:

Facebook