అమరావతి ఖరారు

 -  రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం  
                 అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతి హాసాలలో దేవేంద్రుని రాజధానిగా అభి వర్ణించబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా
వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు నాలుగు శతాబ్దాలు అప్రతిహతంగా, గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్దుడి పాదస్పర్శతో పునీత మైన నగరం. ఆచార్య నాగార్జునుడి వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్రాలతో చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా అలవాలమై విల్లసిల్లిన నగరం.'

- రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                    రాష్ట్ర రాజధాని పేరు ఖరారైంది. సువిశాల భరత ఖండంలో తనదైన ముద్రవేసి, చరిత్రలో చెరిగిపోని గుర్తింపు పొంది, అపురూప శిల్పాలకు ఆలవాలంగా నిలిచిన అమరావతి .. వర్తమానంలోనూ ఆంధ్రుల ఆశలకు ఆలంబన కానుంది. రాజధాని పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా చేసిన తీర్మానంతో ఐదుకోట్ల ఆంధ్రుల అభివృద్ది స్వప్నాలకు అమరావతి కేంద్రబిందువు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన మంత్రిమండలి సమావేశంలో రాజధాని నగరానికి అమరావతి పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాత్రి ఏడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. 'ఇంద్రుడు పాలించిన నగరమని, బుద్దుడు నడిచిన నేల అని' ఆయన అభివర్ణించారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా బాగా కుదిరిందని చెప్పారు. ఎన్నో పేర్లను పరిశీలించి, అన్ని విషయాలు చర్చించిన తరువాత చారిత్రిక ప్రాధాన్యం ఉన్న అమరావతినే రాజధాని పేరుగా ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.
చరిత్ర నుంచి స్ఫూర్తి
                    చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడానికే నూతన రాజధానికి అమరావతి పేరును పెడుతున్నట్లు మంత్రిమండలి పేర్కొంది. 'మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి పేరు నూతన రాజధానికి పెట్టుకుని అత్యంత అధునాతన ప్రజారాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలి' అన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. 21వ శతాబ్దంలో ప్రపంచలోనే అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించడమే కాకుండా రాబోయే శతసహస్త్ర శతాబ్దాల్లో కూడా నిత్యనూతనంగా ఉండేలా రాజధానిని నిర్మిస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రజల ఘన చరిత్ర, విజయగాధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన కీర్తి, తాత్విక చింతనలో కనపరచిన గాఢతను ప్రతిబింబించేలా చేయడమే మంత్రివర్గ ఆకాంక్ష అని తెలిపింది.
పేరు మాత్రమే...!
                    రాజధాని పేరు ఖరారు కావడంతో ప్రస్తుతమున్న అమరావతి పట్టణ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతానికి, ప్రస్తుత అమరావతికి ఏ మాత్రం సంబంధం లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అనుబం ధంగా టూరిజం హబ్‌గా రూపొందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అదే జరిగితే ఘనచరిత్ర ఉన్న ప్రస్తుత అమరావతి ప్రాంతం హైదరాబాద్‌ పాతబస్తీ తరహాలో 'పాత' పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ఆంధ్రుల తొలి రాజధానిగా ధరణికోట ప్రాంతం విరాజిల్లింది. ఆ తరువాత అమరావతి ఖ్యాతిలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతిగా నూతన రాజధాని ప్రాంతం ఆ స్థానాన్ని ఆక్రమించనుంది.
అమరావతి ఖరారు అమరావతి ఖరారు Reviewed by AndhraDarshini on 20:40 Rating: 5

No comments:

Facebook