అందరితో చర్చించాకే...: 'తెలంగాణ'పై చిదంబరం ప్రకటన



తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో, ఇతర సంస్థలతో చర్చించిన తర్వాతే ఈ అంశంపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడ్తామంటూ ఈనెల 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు మారిపోయాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రస్తుతం ఏకాభిప్రాయం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటుపై అందరితో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ ఆందోళనలను ఉపసంహరించి, పరిపాలన సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రి చిదంబరం బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ఒక ప్రకటన చేశారు.
'తీర్మానం' ప్రస్తావన లేదు
    'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. ఈ మేరకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతాం' అని నాటి ప్రకటనలో చిదంబరం పేర్కొన్నారు. తాజా ప్రకటనలో శాసనసభ తీర్మానం గురించి ప్రస్తావన లేదు. 'రాష్ట్ర విభజనపై అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.' అని తాజా ప్రకటనలో చిదంబరం పేర్కొన్నారు. తద్వారా...చర్చల అనంతరమే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పారు.చర్చల ప్రక్రియను ఎలా చేపట్ట నున్నారు? ఆ ప్రక్రియకు వేదిక ఏమిటి? తదితర అంశాలపై ప్రకటనలో ఎక్కడా స్పష్టత లేదు. చర్చల ప్రక్రియకు కాలపరిమితిని కూడా విధించలేదు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ చిత్తశుద్ధిపై పలు అనుమానాలను ముందుకు తెస్తున్నాయి. చిదంబరం తాజా ప్రకటన నేపథ్యంలో, తెలంగాణా అంశం మరోమారు తెరచాటుకు వెళ్లినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఒత్తిడి మేరకే..
    రాష్ట్ర విభజనపై డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటనతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజాగ్రహం పెల్లుబికిన విషయం తెలిసిందే. పార్టీలకతీతంగా నేతలు దీక్షల బాట పట్టారు. ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో ఆ ప్రాంతాల కాంగ్రెస్‌ ఎంపీలపై కూడా ఒత్తిడి పెరిగింది. చిదంబరం ప్రకటనను సవరిస్తూ మరో సర్దుబాటు ప్రకటన చేయాలని 10వ తారీఖు నుండే ఎంపీలు కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. సోనియా, మన్మోహన్‌, ప్రణబ్‌, చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్‌, వీరప్పమొయిలీ తదితర పార్టీ అగ్రనేతలను లెక్కకు మిక్కిలిగా కలిశారు. దాదాపుగా ప్రతిరోజూ ఎవరో ఒక నేతను కలిసి, ప్రకటనపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్రం లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ఎంపీల ఒత్తిళ్ల నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్టానం మెట్టుదిగింది. మరో సర్దుబాటు ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన చిదంబరంతోనే, సర్దుబాటు ప్రకటనా చేయించింది. మంగళవారం అర్ధరాత్రి వరకూ రాష్ట్ర ఎంపీలతో అధిష్టానం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం సౌత్‌బ్లాక్‌లోని ప్రణబ్‌ కార్యాలయంలో సోనియా, మన్మోహన్‌ మినహా ఇతర కోర్‌కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రణబ్‌తో పాటు ఆంటోని, అహ్మద్‌పటేల్‌, చిదంబరం, మొయిలీ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దుబాటు ప్రకటనకు తుదిరూపు ఇచ్చారు. అనంతరం సభ్యులందరూ నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. ఆమెతో ప్రకటనకు ఆమోదముద్ర వేయించుకున్నారు. తరువాత ప్రధాని ఆమోదమూ పొందారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం రాత్రి ఏడున్నరకు చిదంబరం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటనను చదివి వినిపించారు. చిదంబరం ప్రకటన వెలువడేంత వరకూ ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రకటనలోని ముఖ్యాంశాలపై మధ్యాహ్నమే కొన్ని టివి ఛానళ్లకు ఉప్పందింది. ఈ వార్తలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రసారం కావడంతో చిదంబరం అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఉత్కంఠ కొనసాగింది.
మంచి ప్రకటన : సర్వే
    చిదంబరం తాజా ప్రకటనను తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు కూడా స్వాగతించారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మంద జగన్నాథం తదితరులతో కలిసి ప్రకటనపై సర్వే సత్యన్నారాయణ తమ అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు. ' రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చిదంబరం మంచి ప్రకటన చేశారు. కోస్తా, సీమ ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమౌతున్నందున వారితో మాట్లాడతామని చెప్పారు. దీనర్ధం తెలంగాణాపై వెనక్కు వెళ్లినట్లు కాదు. తెలంగాణాపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఒకసారి మాట ఇచ్చాక, వెనక్కు తగ్గే ప్రశ్నే ఉత్పన్నం కాదు ' అని సర్వే వ్యాఖ్యానించారు.
స్వాగతిస్తున్నాం : కావూరి
    చిదంబరం ప్రకటనపై కోస్తా, సీమ కాంగ్రెస్‌ ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిదంబర ప్రకటన వెలువడిన అనంతరం ఎంపీలందరూ ఏలూరు ఎంపీ కావూరి నివాసంలో సమావేశమయ్యారు. పరస్పరం ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఎంపీలందరి తరుపునా కావూరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం అర్ధం చేసుకుందని, ఈ నేపథ్యంలోనే చిదంబరం తాజా ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని తాము మొదటి నుండీ చెబుతున్నామని, తాజా ప్రకటనలోనూ అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటన నేపథ్యంలో కోస్తా, సీమ ప్రాంతాల ప్రజలు ఆందోళనలను ఉపసంహరించుకోవాలని, ఎమ్మెల్యేలు రాజీనామాలను వెనక్కు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ మనోభావాలను గౌరవించి ప్రకటన చేసింనందుకు కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. కావూరి నివాసంలో సమావేశమైన ఎంపీల్లో కెవిపి, జగన్‌, పనబాక, సాయిప్రతాప్‌, శీలం,అనంత వెంకట్రామిరెడ్డి తదితరులున్నారు.
ఇదీ ప్రకటన
    ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై నేనీ ప్రకటన చేస్తున్నాను. డిసెంబర్‌ 7, 2009న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాల (మినిట్స్‌) ఆధారంగా, డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఐతే, ప్రకటన వెలువడిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మారిపోయింది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు చీలిపోయాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, సంస్థలతో విస్తృతంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈలోపుగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, సౌభ్రాతృత్వాన్నఇ పునరుద్ధరించాల్సి ఉంది. తద్వారా పరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించాలి. ఆందోళనలను ఉపసంహరించుకోవాలని, శాంతి, సోదరభావాన్ని కాపాడాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను, రాజకీయ పార్టీలను, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
అందరితో చర్చించాకే...: 'తెలంగాణ'పై చిదంబరం ప్రకటన అందరితో చర్చించాకే...: 'తెలంగాణ'పై చిదంబరం ప్రకటన Reviewed by AndhraDarshini on 01:59 Rating: 5

No comments:

Facebook