బాబు, రామోజీలే కుట్రదారులు


రామోజీరావు తోడల్లుడు, ఈనాడు వ్యవస్థాపక ఎండీ ఎం. అప్పారావు సంచలన వ్యాఖ్యలు
నాడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఇద్దరూ కుట్ర పన్నారు
వైస్రాయ్‌లో 50-60 మంది ఎమ్మెల్యేలు ఉంటే 120 మంది ఉన్నారని రాశారు
చంద్రబాబుకి కుర్చీ కావాలి... ఈయనగారికి సేఫ్టీ కావాలి
ఇద్దరూ పేపర్‌ అడ్డం పెట్టుకుంటున్నారు
ఇప్పుడు ఎవరో కుట్ర చేశారంటున్నారు
జగన్‌ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు
వీళ్లదే అసలైన కుట్ర
విలువలు వేరే వాళ్లకే... రామోజీక్కాదు
మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణ నిజమే
రామోజీ భ విష్యత్తు ఏమిటో జనం చూస్తారు
ఈనాడు ఏమీలేని రోజుల్లో వచ్చింది...
సాక్షి సక్సెస్‌ అనూహ్యం సాక్షిని చూసి ఉడికిపోతున్నారు


హైదరాబాద్‌ ‌: ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు జనంతో లేరని, ఆయన జనం నుంచి ఎన్నడో దూరంగా వెళ్లిపోయారని విశాఖపట్టణంలో ఉంటున్న ఆయన తోడల్లుడు ఎం.అప్పారావు వ్యాఖ్యానించారు. ఆయన పయోముఖ విష కుంభం అని, రాజగురువు కాదని గురివింద అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ ఉన్నప్పుడు ఆయన చేపట్టిన జలయజ్ఞం లాంటి ఒక్క సంక్షేమ కార్యక్రమం గురించి కూడా మంచిగా రాయకుండా పదే పదే వ్యతిరేక కథనాలు ప్రచురించారని, ప్రస్తుతం సాక్షి పత్రికపై దుగ్ధతో రామోజీరావు ఉడికి పోతున్నారని చెప్పారు.

ఇటీవల ఎక్సైల్డ్‌ పత్రిక వైఎస్‌ మరణంపై వెలువరించిన కథనం, టీవీ5 తదితర చానళ్లలో ప్రసారం ... తదనంతరం రాష్ట్రంలో చెలరేగిన విధ్వంసం పథకం ప్రకారం జరిగిన కుట్ర అంటూ ప్రచారం చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. నాడు రామోజీ, చంద్రబాబు చేసింది అసలైన కుట్ర అన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబు, రామోజీరావు కలిసి ఎలా కుట్ర పన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బయటకు రాకుండా కలుగుకే పరిమితమైన చంద్రబాబు రిలయన్స్‌ ఆస్తులపై దాడుల నేపథ్యంలో బయటకు వచ్చి మాట్లాడ్డం, ఈనాడు దాన్ని అందిపుచ్చుకోవడం అంతా కుట్రేనన్నారు.

విలువలు బయటకు చెప్పడానికే తప్ప రామోజీరావు పాటించరని విమర్శించారు. ఆయన ఇప్పటికైనా మారాలని, ఒక్క చంద్రబాబును, తన చుట్టూ ఉండేవారినే కాకుండా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడాలని, ధృతరాష్ట్రుడిగా ఉండొద్దని హితవు పలికారు. టీవీ 5 జర్నలిస్టుల అరెస్టు, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఉద్యమం నేపథ్యంలో... విశాఖపట్టణంలో ఉంటున్న ఈనాడు వ్యవస్థాపక మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన అప్పారావుతో సాక్షి టీవీ మాట్లాడింది. ఈనాడు తొలినాళ్లలో తన అనుభవాలు మొదలుకుని, ఆనాడు తాము పాటించిన విలువలు, క్రమేణా ఈనాడు, దాని అధిపతి రామోజీరావు విలువలకు తిలోదకాలిచ్చి స్వార్థప్రయోజనాల కోసం పత్రికను ఎలా వాడుకుంటున్నదీ ఆయన వివరించారు. రామో జీ బాధితుల్లో తానూ ఒకడిన న్న 'డాల్ఫిన్‌ అప్పారావు' వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

'టీవీ 5 జర్నలిస్టుల అరెస్టు తొందరపాటు చర్య. పూర్తిగా అన్యాయం. ప్రస్తుత పోటీ వాతావరణంలో రష్యన్‌ పత్రిక కథనం మేరకు వాళ్లేదో వేశారు. అయితే అసలు విషయం వైఎస్‌ మరణం వెనుక కుట్ర ఉందా? అనే విషయం వదిలేసి జర్నలిస్టులపై చర్య తీసుకున్నారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని రాశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే ఎవరు కుట్రదారులో తెలుస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు ఎన్టీఆర్‌పై జరిగిన కుట్రకు కూడా సాక్షిని. ఆనాడు ఎన్టీఆర్‌గారికి జరిగిన దారుణాలు ఎన్ని? దాని వెనకాల ఎవరున్నారు. ఏ విధంగా ఆయన్ను పక్కనబెట్టారు. మళ్లీ ఆక్రమిం చేందుకు వైజాగ్‌లో జరిగిన దానికి నేను సాక్షిని. చంద్రబాబు డాల్ఫిన్‌లో, రామోజీ ఇక్కడ ఈనాడు గెస్ట్‌హౌస్‌లో ఉండి మంతనాలు చేశారు. వాస్తవానికి ఆరోజు చంద్రబాబు వెంట కొందరే ఉన్నారు. వైస్రాయ్‌లో వీరంతా కలుస్తున్నారు. కానీ మరుసటి రోజు పేపర్‌లో 120 మంది వైస్రాయ్‌కెళ్లిపోయారని రాశారు. అది ఎంతవరకు కరెక్టు? ఎవరు లెక్కబెట్టారు. ఎంత దారుణమైన సంఘటన. వాస్తవానికి యాభై, అరవైమంది ఉంటారేమో.

పత్రికలో వచ్చిన తర్వాత నిజంగా మెజారిటీ ఉందేమోనని అంతా వెళ్లిపోయారు. అదీ జరిగిన కుట్ర. ఈ దారుణాతి దారుణమైన కుట్రకు మహానుభావుడు (ఎన్టీఆర్‌) ఎంత క్షోభకు గురయ్యాడో. వాళ్ల కుట్రకు పూర్తిగా బలైపోయాడు. అప్పుడు ఆయన అనుభవించిన బాధకు ఇప్పుడు వీళ్లు పర్యవసానం అనుభవిస్తున్నారు. ఎప్పుడూ విలువలు, విలువలు అని చెప్పే పెద్ద మనిషి ఏం విలువలు పాటిస్తున్నాడు. విలువలెంత దిగ జారి పోయాయో. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఎన్ని అబద్ధపు రాతలు రాశారో నాకు తెలుసు. విలువలని చెపుతూ పత్రికను ఎలా వాడుకుంటున్నారో ఆంధ్రదేశం అంతా తెలుసు.

చంద్రబాబు కూడా దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఆడే నాటకం జనానికి తెలుసు. చంద్రబాబుకి కుర్చీ కావాలి. ఈయనకు తన సేఫ్టీ కావాలి. ఈనాడు పెట్టిన కొత్తలో విలువలు ఫాలో అయ్యాం. రానురానూ ఆయన సామ్రాజ్యం విస్తరించింది. కొన్ని బాధలు వచ్చి పేపర్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఆరోజుల్లో తెలుగుదేశానికి పూర్తిగా సపోర్ట్‌ చేశాం. కొంతకాలం తర్వాత ఎన్టీఆర్‌ మాట వినడం లేదని విభేదించడం ప్రారంభించారు. ఆయనకు చంద్రబాబు తోడయ్యారు. ఏవేవో చెప్పేవారు. రామోజీలో కూడా స్వార్థం పెరిగిపోయింది. నేను మార్గదర్శి కృష్ణమూర్తి బయటకు వచ్చేశాం. విశాఖ సీతమ్మధారలో ఈనాడు స్థలం గురించి తెలుసుకుంటే రామోజీ ఇలాంటి వాడా? అంటారు. ఆయనవరకు వచ్చేసరికి విలువలు లుప్తం...జీరో. ఐడీఏలో భూములు కొన్నారు. 33 ఏళ్లు అయిపోయింది. వెకేట్‌ చేయాలి కదా? మార్గదర్శి, ఈనాడు స్థలాలన్నీ లీజు లేదా రెంట్‌కి తీసుకున్నవే.

హైదరాబాద్‌ మార్గదర్శి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మార్గదర్శి డిపాజిట్లు అనాథరైజ్డ్‌గా కలెక్ట్‌ చేశారనే విషయం నిజం. ఉండవల్లి ఫొటోను డిపాజిటర్లు ఇళ్లల్లో పెట్టుకోవాలి. మార్గదర్శి విషయంలో రామోజీ వద్ద సమాధానాలు లేవు. నిమేష్‌ కంపానీ విషయంలో స్పందన ఏదీ. ఫిలింసిటీ భూములు నిజాంవి అన్నారు. అదికూడా నిజమే. వెరిఫై చేశారా? లేదు కొనేశారు అంతే. వాళ్లది అన్యాక్రాంతం వీళ్లది అన్యాక్రాంతం అంటారు. మనం ఎన్ని చెరువులు, ఎన్ని వేల ఎకరాలు చేశాం. విజయవాడలో, విశాఖలో ఉన్న సైట్లు ఎందుకు వదలడం లేదు. అదేమంటే పేపర్‌ ఉంది. బలం ఉంది. కోర్టుల్లో ఎన్నాళ్ళైనా నడపగలం. ఎంత స్వార్థం. అన్నిటికీ అడ్డం పెట్టుకోవడానికి మీడియా కావాలి.'

వైఎస్‌ డేర్‌ డెవిల్‌
'వైఎస్‌ డేర్‌ డెవిల్‌. మనిషంటే ఆయనే. ఎన్టీఆర్‌కి ప్రతిరూపం అనుకోవచ్చు. రామోజీకి ఆయన ఏ విధంగానూ వంగ లేదు. ఆయన ధాటికి ఎక్కడ ఇబ్బందిపడతామోనని ఎప్పటికప్పుడు భయమే. వైఎస్‌ కాబట్టి డేర్‌ చేశారు. రంగాచారి కమిటీ విషయంలో... ఏమన్నా ఉందా? తెలుసుకోమన్నారు. దానికి ఆయన మీద ప్రతిరోజూ అనేకానేక రకాలుగా రాశారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలపై ఏనాడైనా స్పందించాడా? టీవీ 5లో వార్త వచ్చినప్పుడు ప్రాంతాలకతీతంగా జనం ఎలా స్పందించారు. ఇది ఆయనకు నచ్చదు. టీడీపీ హయాంలో ఉద్యమాలను అందిపుచ్చుకోవడంలో దిట్టలం. అప్పుడు మద్య నిషేధం అన్నారు. తర్వాత వదిలేశారు. నాకే స్వార్థమూ లేదు. ఆయనలో ఎప్పుడైతే స్వార్ధం పురివిప్పిందో అప్పుడే బయటకు వచ్చేశాను. ఇచ్చింది పుచ్చుకున్నాను. ఒక్క విజయవాడ సైట్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుంది. కొన్ని వేల కోట్లు కోర్టుల్లో ఉన్నాయి. టైమ్‌ డిలే అవొచ్చు. తప్పకుండా న్యాయం జరిగితీరుతుంది. అప్పుడు ఆయన ఎలా ఉంటారో జనం చూస్తారు.'


సాక్షి నెగ్గుకొచ్చింది..
'సాక్షి ప్రారంభించినప్పుడే ఎలా నెగ్గుకు వస్తుందా అనే అనుమానం కలిగింది. ఈనాడు ఏమీ లేని రోజుల్లో వచ్చింది. కానీ 'సాక్షి' ఆశ్చర్యకరంగా నెగ్గుకువచ్చింది. ఇంత కాంపిటీషన్‌లో ఈ విధంగా తీసుకురావడం అభినందనీయం. ధైర్యంగా రాయడం జగన్‌కే చెల్లింది. ఇది జగన్‌ కుట్ర అన్నారు. చేతులు జోడించి వేడుకుంటే అది పట్టించుకోలేదు. ఎంత దుర్మార్గం. మనిషిని హత్య చేయడం కంటే ఎక్కువ. ఆయన రాజగురువు కాదు గురివింద. ఆయన పత్రికాధిపతి ఏంటి... నేను వ్యవస్థాపక ఎండీని. దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. అడ్డువచ్చిన వాటిని అడ్డు తొలగించుకోవడం ఆయన సిద్ధాంతం. సాక్షి అంటే దుగ్ధతో ఉడికి పోతున్నారు.'
(‘సాక్షి’ సౌజన్యంతో)
బాబు, రామోజీలే కుట్రదారులు బాబు, రామోజీలే కుట్రదారులు Reviewed by AndhraDarshini on 12:58 Rating: 5

No comments:

Facebook