తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన పార్టీలు

తెలంగాణ అంశంపై మంగళవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నార్త్‌బ్లాక్‌లో జరిగిన సమావేశం ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీల ప్రతినిధులు భిన్నస్వరాలు వినిపించారు. తమ తమ వైఖరుల్నే అక్కడా ఉద్ఘాటించారు. దీంతో తదుపరి చర్చలు కొనసాగుతాయన్న సంకేతాలు ఈ భేటీ ద్వారా వెలువడ్డాయి. ఈ చర్చలు ఏ రూపంలో ఉంటాయి? దానికి ఎలాంటి యంత్రాంగం ఏర్పడుతుంది? చర్చల కాల పరిమితి ఏమిటిన్నది ఇప్పడు కేంద్రం వెల్లడించాల్సి ఉంది. రాష్ట్రంలో గుర్తింపుపొందిన 8 రాజకీయ పార్టీల నుంచి ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు చొప్పున మొత్తం 16 మంది ప్రతినిధులు, హోంమంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్త్లె, నిఘా విభాగం(ఐబీ) డైరెక్టర్‌ రాజీవ్‌ మాథుర్‌, ముఖ్యమంత్రి రోశయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతినెలకొల్పాలని ఎనిమిది పార్టీలు ఆ తర్వాత ఉమ్మడి ప్రకటన చేయడం తప్ప సమావేశంలో మరే ఫలితం వెలువడలేదు. ఓ వైపు ఈ సమావేశం నడుస్తుండగానే బయట జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. దీంతో నిరసన కారుల్ని పోలీసులు అరెస్టుచేసి, పోలీసుస్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాల్ని చిదంబరం తెలుసుకున్నారు. ఈ అంశంపై ఓ యంత్రాంగం రూపకల్పన, సంప్రదింపుల కొనసాగింపునకు మార్గదర్శక ప్రణాళిక రూపకల్పనే సమావేశం ఎజెండా అయినప్పటికీ... పార్టీలు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ప్రాంతీయ వాదనల్ని వినిపించే ప్రయత్నంచేశాయి. ఒక్క భాజపా తప్ప అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఏ పార్టీ కూడా తదుపరి, విస్తృతస్థాయి చర్చలకు వ్యతిరేకత తెలియజేయలేదు. వాటి నుంచి వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని వివిధ వర్గాలతో భవిష్యత్తులో విస్తృత సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియపై చిదంబరం ఏ క్షణంలోనైనా ఓ ప్రకటన చేయొచ్చునని అనుకుంటున్నారు. దీనికి ఒక హేతుబద్ధమైన కాలపరిమితి ఉండాలని హోంశాఖ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చర్చించిన తర్వాతే భవిష్యత్‌ మార్గసూచి ఖరారవుతుంది. హోంమంత్రి మూడ్‌ను చూస్తే కేంద్రం ఓ కమిటీ వేస్తుందేమోనని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. చర్చల ప్రక్రియకోసం యంత్రాంగం ఏర్పాటుకు భాజపా, సీపీఐ మినహా మిగతా పార్టీలన్నీ అంగీకరించాయి. అవసరమైతే మరికొన్ని అఖిలపక్ష సమావేశాలు కూడా ఉండొచ్చని చిదంబరం సమావేశానంతరం విలేకరుల ముందు వెల్లడించారు.
తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన పార్టీలు తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన పార్టీలు Reviewed by AndhraDarshini on 11:16 Rating: 5

1 comment:

Facebook