సామ్రాజ్యవాద పోకడలతో ప్రజా సంస్కృతికి ప్రమాదం

తెలుగువారికి సంబంధించినంత వరకు సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు. సంస్కృతిలో భాగం. ప్రకృతితో ముడిపడిన సందర్భం. దాంట్లో లౌకికాంశం, జీవన సారాంశం చాలా ఎక్కువ. అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి, సాంప్రదాయంగా కొనసాగుతూనే వుంది. వ్యవసాయక దేశాలన్నింటిలో ప్రజలు పంటలతో ముడిపడిన పండుగలు జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాల నుంచి మన దేశంలోని చాలా రాష్ట్రాల వరకూ చాలా రూపాల్లో సంక్రాంతి వంటి పండుగలు వున్నాయి.

ఆచారాలు, వేడుకల వెనుక సుదీర్ఘమైన సామాజిక పరిణామ క్రమాన్ని చూడాల్సి వుంటుంది. పరాన్నభుక్కులు వాటిలో దైవిక విశ్వాసాలు, తంతులు ప్రధానం చేసినప్పటికీ వాటి సామాజిక సారాంశం విస్మరించరానిది. ప్రకృతితో, అంతర్గత, బాహ్య ప్రతి బంధకాలతో, ప్రతికూల శక్తులతో మనిషి జరిపే పోరాటంలోనే సంస్కృతి, సంప్రదాయం ఉద్భవిస్తాయి. నాగరికత అభివృద్ధి చెందుతుంది. వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన నాగరికతలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు కూడా వుండవచ్చు. ఒక దశలో ఉజ్వలంగా వెలుగొందిన సంస్కృతి, నాగరికతలు మరో దశలో వెనకపడవచ్చు. ఇండియా, బాబిలోనియా, మెసపటోనియా, పర్షియా, ఈజిప్టు, మాయ, గ్రీక్‌, రోమ్‌ సంస్కృతులు వేరు వేరు దశల్లో వైభవోపేతంగా వెలుగొందినప్పటికీ నేడు ఆ స్థితిలో లేవు. దీనికి చారిత్రక కారణాలు చాలానే వున్నాయి. ఉత్పత్తి శక్తుల స్థాయిని బట్టి, సమాజ అభివృద్ధి దశను బట్టి ప్రకృతితో సంబంధాన్ని బట్టి, ప్రజల చరిత్రలో ఒక వ్యక్తీకరణగా సంస్కృతి రూపొందుతుంది. అది చరిత్ర ఫలితం. చరిత్రలో భాగం. చరిత్రను ప్రభావితం చేసే శక్తి కూడా. సంస్కృతిని ప్రజల విజయంగా చాలా మంది అభివర్ణిస్తారు. తన పరిసరాలపై, పర్యావరణంపై మనిషి ప్రసరించగల ప్రభావానికి ప్రతీక సంస్కృతి. సంస్కృతి సృష్టికర్తలు ప్రజలే. అది ఏ ఒక్కరి గుత్త సొమ్మూ కాదు. అసమానతలు నిండిన సమాజంలో ఉన్నత వర్గాల సంస్కృతి, అశేష జన బాహుళ్య సంస్కృతికీ మధ్య తేడాలు వుంటాయి.
ప్రతి జాతికీ, సమాజానికీ తనదైన విలక్షణ సంస్కృతి వుంటుంది. ప్రజల సమిష్టి జీవన లక్షణం దానికి ప్రాతిపదికగా ఉంటుంది. సంస్కృతిలో కొన్ని తిరోగామి లక్షణాలు వుంటే ఉండవచ్చు. ఉంటాయి కూడా! కాలక్రమంలో ప్రజా చైతన్యం పెరిగే కొద్దీ అలాంటి అంశాలు పరిహరించబడతాయి. అవాంఛనీయమైన, హానికరమైన అంశాలను ఎవరు ఎంత బలవంతం చేసినా చిరకాలం కొనసాగించలేరని మానవాళి పురోగమనం చాటి చెబుతుంది. లోపాలేమైనప్పటికీ భిన్న సంస్కృతుల వైవిధ్యం, ప్రత్యేకతలు గౌరవించదగినవే. కాపాడుకోవాల్సినవే. వాటిలో సమిష్టితత్వం, పురోగామితత్వం కలిగిన అంశాలపై కేంద్రీకరిస్తే చాలా మేలు కలుగుతుంది. అలాగే సమాజ సభ్యుల ఆనందోత్సాహాల, మానసిక వికాసానికి, కళాభిరుచికి, దోహదపడే విషయాలను విలువైన వాస్తవంగా పరిగణించాల్సి వుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచ చరిత్ర క్రమంలో సంస్కృతీ వికాసం సహజంగా జరగనివ్వకపోవడం ఒక వాస్తవంగా మనకు కనిపిస్తుంది. 19వ శతాబ్దిలో బాగా అభివృద్ధి సాధించి వలసాధిపత్యం నెలకొల్పిన పాశ్చాత్య దేశాలు తమ నాగరికతను ప్రపంచంపై రుద్దాయి. ఇండియా చాలా పెద్ద దేశం గనుక ఇంగ్లాండ్‌ ఆ పని చేయలేకపోయింది. పైగా తన పరిపాలనను కొనసాగించుకోవడం ప్రధానంగా పరిగణించి అనేక రకాలైన స్థానిక అంధ విశ్వాసాలతో రాజీ పడింది కూడా. అదే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వంటి చోట్ల ఇంగ్లాండ్‌, అమెరికాలు భిన్నంగా ప్రవర్తించాయి. స్థానిక ప్రజల సంస్కృతిని కాలరాసేశాయి. అంతమాత్రాన భారతీయ ప్రజా సంస్కృతి యథాతథంగా కొనసాగిందని, కొనసాగుతుందని అనుకుంటే పొరబాటే. ధనస్వామ్య విలువలు, సామ్రాజ్యవాద ప్రాబల్యం, మతతత్వ అభివృద్ధి నిరోధకత్వం ఆరోగ్యకరమైన ప్రజా సంస్కృతికి శత్రువులుగా తయారయ్యాయి.
ఇందుకు మూలకారణం పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావంలోనే ఇమిడి వుంది. ప్రతిదాన్నీ లాభాపేక్షకు సాధనంగా చూసే ఆ వ్యవస్థ సంస్కృతిని కూడా విడిచిపెట్టదు సరికదా ప్రత్యేక లక్ష్యంగా ఎంచుకుంటుంది. సమాజ మార్పును నిరోధించేందుకు కూడా అది ఈ పని చేస్తుంది. యంత్ర పరికరాల్లో, సాంకేతిక రంగంలో వచ్చే ప్రతి మార్పును స్వ ప్రయోజనాలకు వినియోగించుకుంటుంది. అచ్చు యంత్రం, రేడియో, టెలిఫోన్‌, టి.వి. ఇప్పుడు కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ ఇలా అన్ని దశలలో, అన్ని సాధనాలను అది తన గుత్తాధిపత్యం పెంచుకోడానికి, ప్రజల ఐచ్ఛిక చొరవను కుదించడానికి ఉపయోగించింది తప్ప పెంచడానికి కాదు. వ్యాపార వ్యవస్థలో సాంస్కృతిక రంగం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. లాభాలు పండిస్తుంది వర్గ ప్రయోజనాలు కూడా సాధించి పెడుతుంది. రేడియోపై చాలా వరకు ప్రభుత్వాల ఆధిపత్యం ఉండేది కనుక వ్యాపార ప్రయోజనాలకు అది పెద్దగా సేవ చేయలేకపోయింది. ఆ దశలో కూడా గ్రాంఫోన్‌ రికార్డులు బాగానే లాభాలు గడించి పెట్టాయి. సినిమా ప్రక్రియ పెంపొందిన తర్వాత సాంస్కృతిక రంగంలో సరికొత్త దాడి ప్రారంభమైంది.
సినిమాను సర్వ కళల సమాహారంగా అభివర్ణిస్తారు. నిజంగానే అన్ని కళలను ఇముడ్చుకోగలిగిన, పెంపొందించగలిగిన సామర్థ్యం సినిమాకు ఉంది. కాని ధనస్వామ్య వ్యవస్థ దానిని కూడా లాభాలకు, ప్రలోభాలకు సాధనంగానే చేసుకుంది. ప్రపంచ చలన చిత్ర నిర్మాణంలో అమెరికా, ఇంగ్లాండ్‌లే అగ్రస్థానం వహించాయి. ముఖ్యంగా హాలీవుడ్‌ సినిమాకు పర్యాయపదంగా మారిపోయింది. ఏవో కొన్ని ప్రయోగాలు జరిగినప్పటికీ హాలీవుడ్‌ చిత్రాలు నేరపూరిత శక్తులను కథానాయకులుగా ముందుకు తెచ్చాయి. తొలిరోజుల నుంచి ఇది జరుగుతూనే వుంది. ఇందుకు భిన్నంగా నాటి సోవియట్‌ దర్శకులు వాస్తవికతను తీసుకొచ్చారు. కాని అంతర్జాతీయ రంగంలో హాలీవుడ్‌దే పై చేయిగా మిగిలిపోయింది. టెలివిజన్‌ రాక ఈ గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. టి.వి. ఛానెల్స్‌ను పాశ్చాత్య కంపెనీలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. 1962లో మొదటి సమాచార ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించినప్పటి నుంచి దాని ఆధిక్యతకు ఎదురు లేకుండా పోయింది. నాటి సోవియట్‌ యూనియన్‌ పుస్తక ప్రచురణ రంగంలో విశేషమైన కృషి చేసినప్పటికీ మీడియాపై అంత పట్టు సంపాదించలేదు. వాస్తవానికి సామ్యవాద దేశాలను కూడా ప్రభావితం చేసే రేడియో, టి.వి. ప్రసారాలను పశ్చిమ దేశాలే రూపొందించగలిగాయి. ఇండియా వంటి వర్థమాన దేశాలు ఇందుకు మరింతగా గురయ్యాయి. మన చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో కళా హృదయులు, దేశ భక్తులు ప్రధాన పాత్ర వహించినా, స్వల్ప కాలంలోనే అది వ్యాపారమయమై పోయింది. 70వ దశకం తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ యాంగ్రీ యంగ్‌మాన్‌ తరహా పాత్రలతో అది హాలీవుడ్‌కు కార్బన్‌ కాపీగా మారింది. ఇప్పుడు ఏకంగా మాఫియా శక్తులే సినిమా నిర్మాణాన్ని శాసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మాటకొస్తే క్రికెట్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ కూడా ధన సంస్కృతి విష ప్రభావానికి అద్దం పడుతుంది. ధన సంపాదన మినహా మరే మానవతా విలువలకు, అభిరుచులకు ప్రాధాన్యత లేనప్పుడు ఇలాంటి పరిస్థితి అనివార్యంగా దాపురిస్తుంది. సినిమాను గురించి ఇంతగా చెప్పుకోవడం ఎందుకంటే గత మూడు, నాలుగు దశాబ్దాల్లో అది జన జీవితాన్ని అసమానంగా ప్రభావితం చేస్తోంది కనుక.
గత దశాబ్దంలో అమలు కొచ్చిన ప్రపంచీకరణ ఈ పరిణామాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పుడు మార్కెట్‌ శక్తులు సాంస్కృతిక రంగాన్ని కూడా పూర్తిగా వశపరుచుకున్నాయి. మార్కెట్‌ విలువలకు అందులోను సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలకు దోహదపడని అంశాలకు చోటు లేకుండా పోతున్నది. ప్రపంచీకరణ పేరిట తమ ప్రయోజనాలను అన్ని దేశాల ప్రజలపై రుద్దడం జరుగుతోంది. 20 నుంచి 30 బహుళ జాతి కంపెనీలు మీడియా సాంస్కృతిక రంగాలపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టైమ్‌ వర్నర్‌, వాల్‌ డిస్నీ, సోనీ, వైకమ్‌, ఎన్‌బిసి వంటి కంపెనీ 'వినోద పరిశ్రమ'ను చేజిక్కించుకున్నాయి. తామరతంపరగా విస్తరించిన టి.వి. ఛానెల్స్‌కు ఇవే మహరాజపోషకులుగా, మార్గదర్శకులుగా వున్నాయి. అంతులేని ఖర్చుతో కూడిన టి.వి. ఛానెల్స్‌ నిర్వహణకు ప్రధాన వనరు వ్యాపార సంస్థలే గనుక వాటి అడ్వర్‌టైజ్‌మెంట్‌ అవసరాల ప్రకారమే కార్యక్రమాలు తయారవుతున్నాయి. సహజంగా అవి అల్పసంఖ్యాకులైన పై వర్గాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజలను ఆలోచింపచేసే ఎలాంటి అంశాలకూ వ్యాపార ప్రయోజనాలు అంగీకరించవు. చెదురుమదురుగా సైన్స్‌, విద్య వంటి కొన్ని అంశాలకు కొద్దిపాటి చోటు కల్పించినా మిగిలిందంతా కాలక్షేపానికి లేదా కాలుష్యం నింపడానికి ఉద్దేశించబడుతున్నది. ఏదైనా టి.వి. పొరపాటున చైతన్యవంతమైన కార్యక్రమాన్ని తయారు చేస్తే స్పాన్సరర్లు దొరకకపోవడమే కాక వాటిని ప్రతికూల జాబితాలో చేర్చడం జరుగుతుంది. చివరగా ఈ తాకిడికి సినిమా పరిశ్రమ కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అయితే అలా దెబ్బతింటున్నది వర్థమానదేశాల సినిమాలే. ఒకవైపున రాష్ట్రంలో సినిమా థియేటర్లు గోదాములుగా మారిపోతుంటే, మరోవైపున హాలీవుడ్‌ సినిమాలు తెలుగులోనే విడుదలవుతుండడం సాంస్కృతిక చొరబాటుకు తిరుగులేని నిదర్శనం. హాలీవుడ్‌ నమూనాలో రూపుదిద్దుకుని ఔత్సాహిక రంగ స్థలాన్ని, జనబాహుళ్య కళారూపాలను కబళించిన భారతీయ సినిమా ఇప్పుడు తానే అందుకు బలికావడం యాదృచ్ఛికం కాదు.
సినిమాల గురించిన చర్చ పక్కన బెట్టి మళ్లీ సాంస్కృతిక విషయాలకు వస్తే నేడు వస్తు వ్యామోహం పెరగడం అందరినీ కలవరపరుస్తుంది. అమానవీకరణగా పిలవబడుతున్న ఈ పరిణామం ప్రపంచీకరణ ప్రత్యక్ష ఫలితమే. వ్యాపార సంస్థల నిర్వహణలో మానవాతీత (ఇంపర్సనల్‌) సంబంధాలు ఉండాలని పాశ్చాత్య మనస్తత్వ వేత్తలు ప్రబోధిస్తున్నారు. మానవుడు ఆధునికుడు అవుతున్న కొద్దీ ఆటవిక లక్షణాలు ప్రకోపిస్తాయని సూత్రీకరిస్తున్నారు. అతనిలోని ఆదిమ భయాన్ని పురిగొల్పి అభద్రతకు గురి చేయడం ద్వారానే ప్రస్తుత పరిస్థితికి ఎదురు తిరగకుండా చేయగలమని వారి సిద్ధాంతం. భయంకరమైన జంతువులు, ప్రమాదాల సినిమాలన్నింటికీ ఇదే మూలసూత్రం. ఇప్పుడు దానికి వస్తు వ్యామోహం తోడు చేయబడుతుంది. ఆ వస్తువులను ప్రధానంగా పశ్చిమ దేశాలే తయారు చేస్తుంటాయి. ఆ విధంగా వ్యాపార ప్రచారానికి తోడు ప్రేక్షకులను మొద్దుపర్చడానికి, ప్రలోభ పెట్టడానికి కూడా ఈ వ్యూహం ఉపకరిస్తుంది. ఆ విష ప్రభావంతో మనిషి సహజ లక్షణాలు, కుతూహలం, జిజ్ఞాస, కళాభిరుచి అన్నీ హరించుకుపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ సాంస్కృతిక దుష్పరిణామం సంస్కృతి వికాసానికి ప్రధాన ప్రమాదమై కూర్చుంది. కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ జపం కూడా ఇందుకు అతీతం కాదు. ఇంగ్లాండ్‌, అమెరికా రెండూ ఉపయోగించే ఇంగ్లీష్‌ భాష ప్రపంచ భాషగా ప్రాబల్యం వహించడం ఇందుకు మరొక సాధనమవుతుంది. ప్రపంచ కంప్యూటర్‌ వ్యవస్థలో నిక్షిప్తమైన సమాచారంలో 80% ఇంగ్లీష్‌లోనే ఉన్నదంటే ఈ సమాచార విస్ఫోటనం సామాన్య ప్రజలకు, దేశీయ సంస్కృతులకు ఏ మేరకు అందుతుందో ఊహించుకోవచ్చు.
భారతీయ సంస్కృతి, వైజ్ఞానికాభివృద్ధి ఒకప్పుడు ప్రపంచాన్నే ఆకర్షించాయి. ఆరాధించబడ్డాయి. దేశదేశాల యాత్రికులు ఇక్కడికి తరలివచ్చారు. అయితే దానికి పూర్తిగా మతం రంగు పులిమి గతం గొప్పదనే అభివృద్ధి నిరోధక శక్తులు కూడా చాలా వున్నాయి. హిందూత్వ పేరుతో ఈనాడు విలయతాండవం చేస్తున్న కాషాయ కూటమి ఆ కోవకు చెందిందే. అలాంటి తిరోగామి ధోరణి అత్యంత ప్రమాదకరమైంది. అదే సమయంలో చరిత్ర క్రమంలో, సమాజ గమనంలో స్థానికంగా ఉద్భవించిన సంస్కృతి అమూల్యమైన వారసత్వమనడంలో సందేహం లేదు. దానిలోని ఉత్తమ లక్షణాలన్నింటినీ ముందుకు తీసుకుపోతేనే సర్వతోముఖప్రగతి సాధ్యమవుతుంది. ప్రపంచీకరణ పేరిట సాగుతున్న సాంస్కృతిక ఆధిపత్యం, చొరబాటు వాటిని సర్వనాశనం చేసేందుకే దారి తీస్తాయి. ఈ విష సంస్కృతికి నిజమైన విరుగుడు సరికొత్త స్ఫూర్తితో, శాస్త్రీయ దృష్టితో ప్రజా సంస్కృతిని పెంపొందించడమే. వేయి పూవులు వికసించాలని అన్నట్లు మారుమూల పల్లెల నుంచి మహానగరాల వరకు ప్రతివారిలో దాగి వున్న ప్రతిభ, సామర్థ్యాలను, కళాభిరుచిని వెలికి తీసేందుకు, వ్యక్తం చేసేందుకు అవకాశం లభించాలి. డిజిటల్‌ మ్యూజిక్‌ మిళితమై కోట్లు సంపాదించి ప్లాటినం డిస్క్‌లు సమకూర్చిపెడుతున్న పల్లె పదాలు సహజసిద్ధంగా ప్రతిధ్వనించే వాతావరణం రావాలి.                      
                                                                                                                                              - తెలకపల్లి రవి
(ప్రజాశక్తి సౌజన్యంతో)
సామ్రాజ్యవాద పోకడలతో ప్రజా సంస్కృతికి ప్రమాదం సామ్రాజ్యవాద పోకడలతో ప్రజా సంస్కృతికి ప్రమాదం Reviewed by AndhraDarshini on 00:55 Rating: 5

No comments:

Facebook