- తెలంగాణ-సీమాంధ్ర నేతల పోటాపోటీ
- భావోద్వేగాలతోనే రాజీనామాలు : స్పీకర్
- ఏకాభిప్రాయం అన్నందుకే ఉపసంహరణ: శైలజానాథ్
- డిఎస్‌తో మంత్రుల భేటీ
గడువు చెప్పనందుకే రాజీనామాలు : తెలంగాణ కాంగ్రెసు నేతలు
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ఎప్పటిలోగా ప్రారంభిస్తారో చెప్పనందుకే పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు తెలంగాణా కాంగ్రెస్ నేతలు తెలిపారు. గురువారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమైన తరువాత మాజీ మంత్రులు ఆర్.దామోదర్‌రెడ్డి, జానారెడ్డి, తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేల జేఎసీ కన్వీనర్ బస్వరాజ్ సారయ్య మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం చేసిన తాజా ప్రకటనలో అనేక అనుమానాలు వుండడంతో తెలంగాణ ప్రజల్లో అవేశం వచ్చిందని జానారెడ్డి అన్నారు. ప్రజల ఒత్తిడిమేరకు తామంతా రాజీనామాలు చేస్తున్నందున తమ బాటలో మంత్రులు కూడా నడవాలని కోరతామని ఆర్.దామోదర్‌రెడ్డి తెలిపారు. నాలుగైదు వేలమంది పోలీసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని అన్నారు. 32 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కచ్చితంగా ఇస్తుందని, సోనియా ఇచ్చిన మాటను తప్పరని ప్రజలకు చెప్పి ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్రం తీసుకుని వచ్చేవరకు గ్రామాల్లో అడుగుపెట్టనీయబోమని ప్రజలు హెచ్చరిస్తున్నారని, తెలంగాణ ఇవ్వాలని సోనియా పాదాలకు మొక్కుతున్నామని ఆయన చేతులెత్తి ప్రార్థించారు. ఆంధ్ర, సీమ నేతల ఒత్తిడుల తలొగ్గే కేంద్రం నిర్ణయం మార్చుకుందని ప్రజలు అంటున్నారని, అలాంటి భావన రానీయకుండా అధిష్టానం చూసుకోవాలని బి.సారయ్య తెలిపారు.
ఏకాభిప్రాయం అన్నందుకే ఉపసంహరణ : సీమాంధ్ర
ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటనలో సృష్టంగా వుందని సీమాంధ్ర ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల కన్వీనర్ శైలజానాథ్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రోశయ్య సూచనల మేరకు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి సమైక్యాంధ్ర కోసం చేసిన రాజీనామాలను వెనక్కు తీసుకోవాలని సూత్రబద్ధంగా నిర్ణయించినట్లు చెప్పారు. 80 మంది వరకు రాజీనామాలు చేశారని, అందుబాటులో వున్నవారందరూ ఉపసంహరించు కుంటారని అన్నారు. రాష్ట్ర విభజనపై అందరి అభిప్రాయాలను తీసుకుంటామని కేంద్రం ప్రకటన చేయడం అభినందనీయమని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ఎక్కడా కేంద్రం ప్రకటించలేదని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని మాత్రమే చెప్పిందని అన్నారు.
డిఎస్‌తో మంత్రుల భేటీ
తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ చిదంబరం ప్రకటన తెలంగాణాకు వ్యతిరేకంగా లేదని, కానీ అందులో సృష్టత లేదని అన్నారు. రాష్ట్ర ప్రక్రియను ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. కాలపరిమితి నిర్ణయిస్తే ఆందోళనలు సద్దుమణుగుతాయని, ప్రజల్లో నమ్మకం వస్తుందని అన్నారు. ఆంధ్ర, సీమల్లో ఉద్యమం అనంతరం రెండుమూడు దఫాలుగా కోర్ కమిటీ చర్చించిన తరువాతే ప్రకటన వచ్చిందని, అందులో ఎక్కడా తెలంగాణ ఇవ్వబోమని చెప్పలేదని అన్నారు. రాష్ట్రంలో సంక్షోభం రావడానికి చంద్రబాబే కారణమని, మద్దతిస్తామని చెప్పి మాటమార్చడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
మంత్రులెవరూ రాజీనామాలు చేయరు : రాంరెడ్డి
అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని, మంత్రులెవరికి రాజీనామాలు చేసే యోచన లేదని రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అధిష్టానాన్ని కోరతామని అన్నారు. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయబోరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అటు రాజీనామాలు...ఇటు ఉపసంహరణలు
Reviewed by AndhraDarshini
on
01:04
Rating:

No comments: