‘రాజధాని’కి జూన్ 2న శంకుస్థాపన

సీఎం చంద్రబాబు
రాజధాని ప్రాంతం మూడు భాగాలుగా విభజించి.. అభివృద్ధి

 రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయ్యే జూన్ 2నే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే ఆ రోజునే రాజధానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులకు వెల్లడించారు. శనివారం శాసన వాయిదా పడిన తర్వాత అక్కడ ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం, సాధారణ, రైల్వే బడ్జెట్‌లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సీఎం చర్చించారు. మంత్రులు, అధికారుల టీఏ, డీఏ మినహా రాజధాని భూ సేకరణ కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయకుండా 32 వేల ఎకరాలను సేకరించిందని చెప్పారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, రైతులకు ఇచ్చింది పోగా ప్రభుత్వానికి ఏడున్నర వేల ఎకరాలే మిగులుతుందని వారికి వివరించారు. రాజధాని ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తామని తన పార్టీ వారికి చంద్రబాబు వివరించారు. తుళ్లూరు, మంగళగిరి తదితర ప్రాంతాలను కోర్ ఏరియాగా తొలి దశలో, ఆ తరువాత కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను రెండో దశలో, సీఆర్‌డీఏ పరిధిలోని ఇతర ప్రాంతాలను మూడో దశలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
‘రాజధాని’కి జూన్ 2న శంకుస్థాపన ‘రాజధాని’కి జూన్ 2న శంకుస్థాపన Reviewed by AndhraDarshini on 20:33 Rating: 5

No comments:

Facebook