రణరంగంగా ఓయు

  • తెలంగాణా టిడిపి నాయకులపై దాడి
  • నాగం, దేవేందర్‌గౌడ్‌, కడియంపై ముష్టిఘాతాలు
  • వాహనాలు ధ్వంసం
  • విద్యార్ధులపై టియర్‌గ్యాస్‌, లాఠీఛార్జి
    ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారింది. దాడులు ప్రతిదాడులతో అట్టుడికింది. పోలీసులు లాఠీఛార్జి, టియర్‌గ్యాస్‌ వంటి చర్యలు చేపట్టారు. దీనికి తోడు గురువారం కళింగ భవన్‌లో జరిగిన తెలంగాణా జెఎసి సమావేశంలో కెసిఆర్‌, గద్దర్‌ తదితర నాయకులు ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ఓయుకు వెళ్లాలని కోరారు. న్యాయవాదులు కోర్టులు బహిష్కరించి ఓయులో జరిగిన సభలో పాల్గొన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉద్రిక్తత యూనివర్సిటీలో కన్పిస్తోంది. విద్యార్ధుల ఆందోళనలో కొన్ని సంఘవిద్రోహ శక్తులు చొరబడ్డాయి. వీరే విద్యార్థులను రెచ్చగొట్టి దాడులకు కారకులయ్యారని పోలీసులు చెప్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు ఓయుకు వచ్చిన తెలుగుదేశంపార్టీ నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరిపై దాడి జరిగింది. ఈ దాడిలో నాగం జనార్ధన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. టిడిపి నేతలపైకి చెప్పులు, వాటర్‌బాటిళ్లు విసిరారు. నాగంపై పిడిగుద్దులు కురిపించారు. వారి వాహనాలు ధ్వంసం చేశారు. మొత్తం 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. చంద్రబాబు డౌన్‌డౌన్‌, గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ దాడిలో బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
    నాగంపై దాడిచేసిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన రౌడీ షీటర్‌ అర్వపల్లి నాగరాజుగా గుర్తించారు. ఇతనిపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అంతకు ముందు ఉదయం పది గంటల సమయంలో యూనివర్సిటీలోని ఓల్డ్‌ పిజి కళాశాల వద్ద మోహరించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారు ప్రతిదాడులు చేశారు. లాఠీఛార్జి చేశారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లాఠీ ఛార్జిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హాస్టళ్లలోకి జొరబడి పోలీసులు విద్యార్థులను చావబాదారు. డిఐజి ప్రవీణ్‌కుమార్‌ కూడా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మోకాలుకు రాయి తగలడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. 108 అంబులెన్స్‌ సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించుకొని యూనివర్సిటీలోనే ఉన్నారు.
    విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణా నాయకులు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో యూనివర్సిటీకి వచ్చారు. అప్పటికే అక్కడ టిఆర్‌ఎస్‌ నాయకుడు ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ చుక్క రామయ్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్నారు. అక్కడే మరోచోట కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కూడా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. అదే సమయంలో నాగం జనార్ధన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మహేందర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్‌, ఉమా మాధవరెడ్డి తదితరులు అక్కడికి వచ్చారు. మరో వైపు నుండి ఎర్రబెల్లి దయాకర్‌, కడియం శ్రీహరి వచ్చారు. అక్కడి పచ్చికలో కూర్చొని మాట్లాడుతున్న శ్రీధర్‌రెడ్డి వద్దకు వెళ్లి దయాకర్‌ కూర్చున్నారు. కడియం నేరుగా ఆర్ట్స్‌ కళాశాల వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి, కడియంను దుర్భాషలాడారు. ఆంధ్రానేత చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. అదే సందర్భంలో నాగం బృందాన్ని వేదిక వద్దకు రానీయకుండా అడ్డుకున్నారు. గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈలోపు కొందరు వ్యక్తులు వారిపై చెప్పులు, వాటర్‌బాటిళ్లు విసిరేశారు. అదే అదనుగా మరికొందరు నాగం, దేవేందర్‌గౌడ్‌పై దాడికి పాల్పడ్డారు. కడియం శ్రీహరిపై మరో బృందం దాడి చేసింది. దీంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. ఉమా మాధవరెడ్డిపై కూడా కొందరు చేయిచేసుకున్నారు. చెప్పులు విసిరేశారు. దేవేందర్‌గౌడ్‌, నర్సింహులు పరుగున వెళ్లి వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ దాడిలో నాగం అక్కడే కింద పడిపోవడంతో కాళ్లతో తన్నారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. గన్‌మెన్‌లు సమయస్ఫూర్తిగా వ్యవహరించి నాగంను అక్కడి నుండి తప్పించారు. వాహనాలను అక్కడే వదిలేయడంతో ఆందోళనకారులు అద్దాలు పగులకొట్టి పల్టీలు కొట్టించారు. టిడిపి నాయకుల వాహనం అనుకొని ఎమ్మెల్సీ చుక్క రామయ్య వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా ఈ దాడిలో బయటి వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఇద్దరి వివరాలు గుర్తించినట్లు సమాచారం. వీరికి యూనివర్సిటీతో సంబంధం లేదని తేలింది. మరి కొందర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఓ రివాల్వర్‌ విద్యార్థులకు దొరికింది. దాన్నివారు పోలీసులకు అందచేశారు.
మీడియాపై దాడి
    ఉదయం పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా వీడియోగ్రాఫర్లపై దాడి జరిగింది. ఈటివి-2, టివి9, సాక్షి ఛానెళ్ల ఓబి వ్యాన్‌లను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధిపై కూడా దాడి చేశారు. దీంతో మీడియా సిబ్బంది కొద్దిసేపు అక్కడ ఆందోళన నిర్వహించారు. ఐతే పరిస్థితి అప్పటికే చేయిజారడం, పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించడం వంటి చర్యలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధులను సంయమనం పాటించమని విజ్ఞప్తి చేశారు.
విచారణకు ఆదేశం
    ఓయులో తెలుగుదేశంపార్టీ నాయకులపై దాడికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో పోలీస్‌ కమిషనర్‌ బి.ప్రసాదరావు యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. మరికొన్ని అదనపు బలగాలను అక్కడ మోహరించారు.
రణరంగంగా ఓయు రణరంగంగా ఓయు Reviewed by AndhraDarshini on 01:03 Rating: 5

No comments:

Facebook