మాతృభాషపై నిర్లక్ష్యం తగదు

విజయవాడ వేదికగా ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. తెలుగునాట లబ్ధప్రతిష్టులైన అతిరథమహారథులు ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. నగరంలో ఏనోట విన్నా తెలుగు వెలుగుల మాటలే, తెలుగు మహాసభల ముచ్చట్లే వినిపించాయి. తొలిరోజు ఆసాంతం కవులు, సాహిత్య ప్రియులు ఉల్లాసంగా పాల్గొన్నారు.

మాతృభాషపై నిర్లక్ష్యం తగదని, అలా నిర్లక్ష్యం చేయడమంటే మాతృమూర్తిని తిర్కరించినట్లేనని మహాత్మాగాంధీ అన్న మాట అక్షర సత్యమని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు శనివారం వేటూరి సుందరరామమూర్తి కళా వేదికపై(తుమ్మలపల్లి కళాక్షేత్రం) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాక్షేత్రం వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహావిష్కరణ అనంతరం, వేటూరి ప్రాంగణంలో జరిగిన ప్రారంభ సభలో సినారే ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతమూ చాలా ఆసక్తిగా సాగింది.

తెలుగు భాషను వినియోగించడం తగ్గిపోయిన మాట అటుంచితే కొన్ని కొన్ని పదాలతో భాషను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సభల్లో కూడా జ్యోతి ప్రజ్వలన అనే మాట వాడుతున్నారని, ప్రజ్వలనం అంటే మండించడమని తెలియకపోవడం విచారకరమని నారాయణరెడ్డి అన్నారు. జ్యోతిని వెలిగించడం లేదా జ్యోతి ప్రకాశనం సరైన పదాలని చెప్పారు. అలాగే ‘పాటల కచేరీ’ అనేది సరైంది కాదని, ‘పాటల గోష్టి’ అని వాడితే భాషకు పుష్టిగా ఉంటుందని తెలిపారు. ఆంగ్లం(ఇంగ్లీష్) మాట్లాడే తల్లులకు పుట్టే బిడ్డలు ‘కెవ్వ్!’మనకుండా ‘మామ్,’ ‘డాడ్’ అంటారేమోనని అనిపిస్తుందని చమత్కరించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి. అధికార భాషా సంఘం ఏనాడో ఏర్పడినా భాషాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. సచివాలయం, జిల్లా, మండల స్థాయిలో తెలుగు భాష వాడకాన్ని పరిశీలిస్తే కిందిస్థాయిలో 20 శాతం, జిల్లా స్థాయిలో 15 శాతం, సచివాలయంలో ఐదు శాతం కూడా లేదన్నారు. తెలుగు పదాలు అచ్చులతో అంతమవుతాయని, అందుకే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ‘సుందర తెలుంగు’ అని కీర్తించారని సినారే పేర్కొన్నారు.

ప్రసార మాధ్యమాలు పూనుకోవాలి : కాళీపట్నం
ప్రసార మాధ్యమాలు పూనుకుంటే తెలుగుభాష పరిరక్షణ సాధ్యమేనని ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు అన్నారు. దూరదర్శినులు(టీవీ) వచ్చిన తరువాత తెలుగు భాష కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

భాషకు భౌగోళిక హద్దులు లేవు : అగ్రహార కృష్ణమూర్తి
భాషకు భౌగోళిక హద్దులు లేవని, సాహిత్య అకాడమీ(న్యూఢిల్లీ) కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి అన్నారు. కన్నడ నాట కవులు కూడా తెలుగు భాషను ప్రశంసిస్తారని తెలిపారు. భాష వ్యక్తి గుర్తింపునకు చిహ్నమని చెప్పారు. అనంతరం, శాంతా బయోటెక్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేఈ వరప్రసాద్‌రెడ్డి ‘తెలుగు వెన్నెల’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాంతీయ తత్వాలకు మనుగడ లేదని, రచయితలు తమ పంథా మార్చుకోవా లని అన్నారు. భాష, సంస్కృతులే మనల్ని రక్షిస్తాయని చెప్పారు.

తెలుగును విశ్వభాషగా తీర్చిదిద్దాలి : యార్లగడ్డ
హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మహాసభల లక్ష్య ప్రస్థావన చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగుభాషను విశ్వభాషగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ‘ఈ పాఠశాలలో మా బిడ్డకు తెలుగు నేర్పండి’ అని ప్రభుత్వాన్ని తెలుగువాడు నిలదీయాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. విదేశీ మోజులో తెలుగు సంస్కృతికి దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘తెలుగు పున్నమి’ గ్రంథాన్ని, ముక్కామల నాగభూషణం రచనల సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్, ముక్కామల అప్పారావు, సాంస్కృతిక సంచాలకులు కే హర్షవర్థనరావు, పురావస్తు శాఖ సంచాలకులు డాక్టర్ చెన్నారెడ్డి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, రచయిత్రి మాలతీ చందూర్, దూరదర్శన్ డెరైక్టర్ (న్యూఢిల్లీ) అనంత పద్మనాభరావు, ఉర్దూ కవి షీన్‌కాఫ్ నిజాం, ఆకాశవాణి విజయవాడ సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాతృభాషపై నిర్లక్ష్యం తగదు మాతృభాషపై నిర్లక్ష్యం తగదు Reviewed by AndhraDarshini on 11:00 Rating: 5

No comments:

Facebook