తెలుగు తల్లికి మంగళారతులు

కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా కళాక్షేత్రం ప్రధాన ద్వారం వద్ద
ఏర్పాటు చేసిన తెలుగు తల్లి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. జ్ఞానపీఠ్ ఆవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఇతర ప్రముఖుల సమక్షంలో మంగళవాయిద్యాల మధ్య మనోల్లాసంగా సాగిన ఈ వేడుకలో పలువురు కవులు, రయితలు పాల్గొన్నారు. ఎనిమిది అడుగుల ఎత్తులో స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలుగు తల్లి ఎందరినో ఆకట్టుకుంది. కళాక్షేత్రం ప్రాంగణమంతా ప్రాచీన కవులు, రచయితల ప్లెక్సీ బ్యానర్లతో కళకళలాడింది.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులు, రచయితలు ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, భారతీయ భాషా కేంద్రం (మైసూర్), సాహిత్య అకాడమీ (ఢిల్లీ) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ సభలకు రాష్ట్ర, రాష్ట్రేతర, విదేశాల రచయితలు విచ్చేశారు. బెంజి సర్కిల్ వద్ద ఎస్‌వీఎస్ కల్యాణమంటపంలో మధ్యాహ్నం నుంచి వివిధ అంశాలపై ప్రారంభమైన సదస్సులు సాహితీ అభిమానుల్లో సందడి నింపింది. ఈ సదస్సుల్లో కవులు, రచయితలతోపాటు పురావస్తు శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల శాఖల ఆధ్వర్యంలో తెలుగువారి చారిత్రక స్థలాలు, కట్టడాలు, నాణాలు, శాసనాలపై ఛాయాచిత్ర ప్రదర్శన, పుస్తకాల స్టాళ్లు ఆహూతులను విశేషంగా ఆకర్షించాయి. సాయంత్రం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సాహిత్యాభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు నిర్వాహకుల మర్యాదలతో సంతృప్తి చెందారు.
తెలుగు తల్లికి మంగళారతులు తెలుగు తల్లికి మంగళారతులు Reviewed by AndhraDarshini on 11:12 Rating: 5

No comments:

Facebook