తెలుగు వారసత్వాన్ని కాపాడుకోవాలి

రాష్ట్రంలో నెలకొన్న పలుధోరణులు తెలుగువారి వారసత్వాన్ని కాపాడలేకపోతున్నాయని మాజీ మంత్రి, జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎస్‌వీఎస్ కళ్యాణ మండపంలోని ‘సురవరం ప్రతాపరెడ్డి’ వేదికపై జరిగిన సదస్సులో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. జిల్లాలోని ఘంటసాలలో కోట్ల విలువైన బుద్ధవిగ్రహాన్ని కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతి, భాష ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు, చరిత్ర పరిశోధనలో ఎదురవుతున్న సమస్యలు, రేపటి సామాజిక అవసరాలపై సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ, చరిత్రను విస్మరించిన సమాజానికి భవిష్యత్తు ఉండదని అన్నారు. భాషకులాగానే చరిత్రకు హద్దులు, ఎల్లలు లేవని చెప్పారు. చరిత్ర రచనకు కావలసిన సామగ్రి గురించి పట్టించుకునేవారు కరువయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి సంపదకు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన కైఫీయత్‌లు అనేకం ఉన్నాయని తెలిపారు.

పురావస్తు శాఖలో అటెండర్లే ఇన్‌చార్జులు : చెన్నారెడ్డి
పురావస్తు శాఖ సంచాలకులు డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ, తమ శాఖలో అటెండర్లు ఇన్‌చార్జులుగా ఉంటున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మరో మూడేళ్ల తరువాత ఈ శాఖకు డెరైక్టర్లు అనేవారు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చరిత్ర పరిశోధకులు వీవీ కృష్ణశాస్త్రి మాట్లాడుతూ, రాష్ర్టంలో 70 చారిత్రక కోటలు ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోలేక పోతున్నామని అన్నారు.

అక్షరాలే శాశ్వతం : నన్నపనేని
ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ శాశ్వతంగా నిలిచేది ఆస్తులు కాదని, అక్షరాలు మాత్రమేనని అన్నారు. తెలుగు పదాలే శాశ్వతమని, పదవులు కాదన్నారు. పుట్టకతోనే వచ్చే తెలుగును మర్చిపోవడం అంటే మనల్ని మనం మర్చిపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ, జాతి, భాషా మూలాలు తెలియని వారు రాజకీయాల్లో ఉండడం, ఆచార్యుల స్థానాల్లో ఉన్న వారు విద్యార్థులను తప్పుదారి పట్టించడంతో తెలుగు జాతి మధ్య చీలికలు వస్తున్నాయని అన్నారు. సీనియర్ పాత్రికేయులు పొత్తూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చరిత్ర పట్ల ఎవరు బాధ్యత వహించాలో వారు చూపించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమానికి సమన్వయ కర్తగా డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ వ్యవహరించారు. హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీపాద సుబ్రహ్మణ్యం, హర్షవర్థన్, డాక్టర్ వై రాజారామ్, ప్రొఫెసర్ లలిత, బీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట పురావస్తు శాఖ ప్రచురించిన ‘ఆంధ్రప్రదేశ్‌లో పురావస్తు పరిశోధనలు’ అనే పుస్తకాన్ని మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. సదస్సులో పాల్గొన్న వారిని నిర్వాహకులు సత్కరించారు.

కవి సమ్మేళనాలు..
వేగుంట మోహన ప్రసాద్(మో) వేదికపై ప్రత్యేక కవి సమ్మేళనం జరిగింది. దీనిలో ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాదరావు, అనంత శ్రీరామ్, చలపాక ప్రకాష్, డాక్టర్ ఆశావాది ప్రకాశరావు, ఆచార్య శిఖామణి, ఎస్ నరసింహరాజు, మందరపు హైమావతి, రాథేయ, గన్ను కృష్ణమూర్తి, మాధవీ సనార, పాటిబండ్ల రజని, ఇందూ రమణ, కావూరి సత్యవతి, వై శ్రీరాములు, సీహెచ్ కళావతి, సర్వజిత్, శిఖా ఆకాష్, తల్లాప్రగడ రవికుమార్ ఉన్నారు.
తెలుగు వారసత్వాన్ని కాపాడుకోవాలి తెలుగు వారసత్వాన్ని కాపాడుకోవాలి Reviewed by AndhraDarshini on 11:22 Rating: 5

No comments:

Facebook