వరుస బంద్‌లతో కుదేలవుతున్న రవాణా

గత నెల రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల దెబ్బకు రవాణా రంగం కుదేలవుతోంది. దక్షిణ భారత దేశంలో రవాణా రంగానికి ముఖ్యంగా రోడ్డు రవాణాకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరం మీద రాష్ట్ర రాజకీయ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోంది. వరుస బంద్‌లతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయి రవాణా వ్యవస్థ పదే పదే స్తంభించిపోతోంది. ముఖ్యంగా 24 గంటలలోగా గమ్యస్థానాలకు చేరాల్సిన పచ్చి సరుకు రవాణా మీద ఈ బంద్‌లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంతో పాటు మన పొరుగు రాష్ట్రాలు కూడా వచ్చే ఆదాయం కూడా పోతోంది. ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగితే రవాణా రంగం మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారులు గత నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ జాతీయ రహదారి మీద అలాగే, తెలంగాణా జిల్లాల్లో దాదాపు 40 లారీలను ధ్వంసం చేశారు. వీటిలో 12 లారీలను సరుకుతో సహా తగలబెట్టారు. ఎ.పి. 16 రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో లారీ కనబడితే చాలు అది ఆంధ్రా రిజిస్ట్రేషన్‌ లారీ అనే భ్రమతో ఆందోళనకారులు లారీ మీద దాడి చేసి ధ్వంసానికి పూనుకుంటున్నారు. చౌటప్పల్‌, చిట్యాల, నార్కెట్‌పల్లి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర ప్రాంతాల్లో సరుకుతో వెళుతున్న లారీల మీద దాడులు జరిగాయి. నందిగామ, కంచికచర్ల ప్రాంతాలకు చెందిన మూడు లారీలను తగలబెట్టారు. తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ నుంచి వెళ్ళిన కొబ్బరికాయల లోడుతో ఉన్న రెండు లారీలు దగ్ధం చేశారు. మిర్చి లోడుతో వెళుతున్న మరి కొన్ని లారీలను డీజిల్‌ పోసి తగలబెట్టారు. దీంతో విజయవాడ నుంచి అలాగే, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి హైదరాబాద్‌ జాతీయ రహదారి మీదుగా లారీలు పంపడానికి భయపడే పరిస్థితేర్పడింది.

చిన్న రాష్ట్రాలు ఏర్పడితే రవాణా రంగంపై పన్నుల భారం
చిన్న రాష్ట్రాల వల్ల రవాణా రంగంపై పన్నుల భారం పెరుగుతుంది. సరుకుతో వెళుతున్న లారీలు మన రాష్ట్రం సరిహద్దులు దాటి పక్క రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే మళ్లీ అక్కడి చట్టాల మేరకు పన్నులు కట్టాల్సి వస్తుంది. అంటే ఎన్ని రాష్ట్రాల సరిహద్దులు దాటితే అన్ని సార్లు పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల లారీ రవాణా భారంగా తయారవుతుంది. ఆ మేరకు రవాణాదారుడు తమ మీద పడిన పన్నుల భారాన్ని ప్రజల మీద వేస్తాడు. వెరసి ఈ భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తుంది.

12 ఏళ్ళు దాటిన లారీలకు నేషనల్‌ పర్మిట్‌ నో.......
12 ఏళ్ళ క్రితం స్టేట్‌ పర్మిట్‌ లేదా సౌత్‌ ఇండియా పర్మిట్‌తో రిజిస్టరు అయిన లారీలకు నేషనల్‌ పర్మిట్‌ ఇవ్వరు. అంటే 1998కి ముందు స్టేట్‌ పర్మిట్‌తో రిజిస్టరు అయిన లారీలు నేషనల్‌ పర్మిట్‌కు నోచుకోవు. దీంతో 12 ఏళ్ళ క్రితం తెలంగాణా జిల్లాలో రిజిస్టరు అయిన లారీలు ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఆంధ్రాలోకి అడుగు పెట్టలేవు. అలాగే ఆంధ్రాలో రిజిస్టరు అయిన లారీలు తెలంగాణా రాష్ట్రంలోకి అడుగు పెట్టడం సాధ్యం కాదు. దీని వల్ల అటు తెలంగాణా లారీలు, ఇటు ఆంధ్రా లారీలు కూడా నష్టపోతాయి. ఈ పరిస్ధితి పట్ల రాష్ట్రంలోని 160 లారీ, మినీ లారీ, ట్రక్కర్‌ అసోసియేషన్లన్నీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 160 అసోసియేషన్లలో 60 సంఘాలు తెలంగాణా జిల్లాల్లో ఉండగా, 100 సంఘాలు కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి. వరుస బంద్‌లు ఆపాలనీ, అలాగే లారీల మీద దాడులు చేసి ధ్వంసం చేసే పధ్ధతికి స్వస్తి చెప్పాలనీ ఈ అసోసియేషన్ల నాయకులు, తెలంగాణా ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరుస బంద్‌లతో కుదేలవుతున్న రవాణా వరుస బంద్‌లతో కుదేలవుతున్న రవాణా Reviewed by AndhraDarshini on 11:54 Rating: 5

No comments:

Facebook